తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. మంత్రికి సుప్రీంకోర్టు నుంచి నోటీసులు
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ప్రచారం ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందడం కలకలం రేపుతోంది. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు అనే పిటీషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.
ఈ నోటీసులపై తక్షణమే సమాధానం ఇవ్వాలనీ సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018 నాటి ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఇదే పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పీల్ పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు.
దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం శ్రీనివాస్ గౌడ్‌కు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో- తక్షణమే ఆయన ఈ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications