కేటీఆరా ? రేవంత్ రెడ్డా ? కాసేపట్లో తేల్చబోతున్న సుప్రీంకోర్టు..!
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు భవిష్యత్తును సుప్రీంకోర్టు ఇవాళ తేల్చబోతోంది. ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఆయనతో పాటు మరికొందరు అధికారులపై తెలంగాణ ఏసీబీ, ఈడీ ఉరుముతున్న నేపథ్యంలో ఈ కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటికే తిరస్కరణకు గురైంది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందే తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ సర్కార్ కేవియట్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తో పాటు రేవంత్ రెడ్డి సర్కార్ దాఖలు చేసిన కేవియట్ పైనా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపబోతోంది. సంక్రాంతి సెలవుల తర్వాత ఇవాళ ఈ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్దమైంది. ఫార్ములా-ఈ కార్ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ కోరుతున్నారు. గతంలో హైకోర్టు తన పిటిషన్ ను తిరస్కరించడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

అయితే హైకోర్టు నిర్ణయం సరైనదేనంటూ రేవంత్ సర్కార్ తన వాదనతో సిద్దమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుతీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. ఒక వేళ సుప్రీంకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను తిరస్కరిస్తే ఆయన్ను అరెస్టు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. క్వాష్ చేయకుండా దీనిపై మధ్యంతర ఉత్తర్వు ఏదైనా ఇస్తే మాత్రం ఆ మేరకు కేటీఆర్ కు ఊరట దక్కబోతోంది. దీంతో కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications