డ్రైవర్ల నిర్లక్ష్యం: కారు డోరులోంచి తల బయటపెట్టి బరాత్ చూస్తున్న చిన్నారి మృతి
హైదరాబాద్: కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో బంధువుల పెళ్లికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సూర్యపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. అప్పటి వరకు సందడిగా సాగిన పెళ్లి వేడుకలు మూగబోయాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొజ్జగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పెళ్లి వేడుకలు జరుగుతుండగా బాణోతు ఇంద్రజ(9) అనే చిన్నారి వరుడు, వధువు ఉన్న కారు వెనుక సీటులో ఒంటరిగా కూర్చుని కిటికీలోంచి తల బయటపెట్టి బరాత్‌లో డ్యాన్సులు చూస్తోంది. ఇదే సమయంలో కారు డ్రైవర్ చిన్నారిని గమనించకుండా డోర్ అద్దం బటన్ నొక్కాడు.

ఈ క్రమంలో చిన్నారి మెడ అందులో ఇరుక్కుని పోవడంతో ఊపిరాడక మృతి చెందింది. దీంతో అప్పటి వరకు ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్ శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
చెట్టు కొమ్మ పడి మరో చిన్నారి మృతి
ఎండా కాలం కావడంతో ఉక్కపోత తట్టుకోలేక ఇంటి ఆవరణలోని చెట్టుకింద పడుకుంది ఓ కుటుంబం. అయితే, ఒక్కసారిగా గాలిదుమారం రావడంతో ఆ చెట్టు నుంచి ఓ కొమ్మ వచ్చి ఆ కుటుంబంలోని ఓ చిన్నారిపై పడింది. దీంతో ఆ బాలిక కన్నుమూసింది. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హనుకొండలోని ఐనవోలు మండలం నందనం గ్రామంలో కన్న శ్రీజ(9) వేప చెట్టు కింద తన తల్లితో కలిసి సోమవారం రాత్రి నిద్రిస్తోంది. గాలి ఎక్కువగా ఉండటంతో ప్రమాదశవశాత్తు ఒక్కసారిగా కొమ్మ విరిగి శ్రీజపై పడింది. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కొమ్మ కింద పడటంతో పక్కనే ఉన్న తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. తన పక్కనే నిద్రిస్తున్న కూతురు రక్తపు మడుగులో ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురైంది. అప్పటికే చిన్నారి మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications