'కాంగ్రెస్ మొసళ్ల పార్టీ': అసెంబ్లీలో వెనుక బెంచీలోకి రేవంత్
హైదరాబాద్: తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయికి ఎదిగిన తనకు కాంగ్రెస్ వైపు చూడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొసళ్ల మడుగు వంటిదని అందులో మనిషి పడితే ఎముకలు కూడా లేకుండా మింగేస్తుందని అన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బూత్ లెవల్ నుంచి పునర్నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై పోరాటం ఒక్క టీడీపీతోనే సాధ్యమని చెప్పారు. టీడీపీ నాయకుడిగా ఉంటూనే కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఆయన చేశారు.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత రెడ్డికి అసెంబ్లీలోని ఐదో బ్లాకులో నాలుగో వరుసలో సీటు కేటాయించారు. సీపీఐ, సీపీఎం, వైసీపీ శాసనసభాపక్ష నేతలకు కూడా ఇదే వరుసలో సీట్లు కేటాయించారు. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం శుక్రవారం నోట్ విడుదల చేసింది.

కానీ, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ శాసనసభాపక్ష నేతలకు మాత్రం మొదటి వరుసలోనే సీట్లు కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో సీట్ల కేటాయింపులో భారీ మార్పులు చేపట్టారు. టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమైన నేపథ్యంలో, వారికి అధికార పక్షంలో సీట్లు కేటాయిస్తూ ఈ మార్పులు చేశారు.
అసెంబ్లీలో మొత్తం ఆరు బ్లాకులు ఉండగా ఐదు బ్లాకుల ముందు వరుసల్లో ముఖ్యమంత్రి, మంత్రులకు సీట్లు కేటాయించారు. కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీఎల్పీ నేతలకు ముందు వరుసలోనే చోటు కల్పించారు. దీనిపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో విపక్ష నేతగా తనకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా నాలుగో వరుసలో కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని ఆయన ఆరోపించారు. ''మాకూ మంచి రోజులు వస్తాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీలో మొన్నటిదాకా 15గా ఉన్న టీడీపీ బలం 'టీఆర్ఎస్ ఆకర్ష్' నేపథ్యంలో ఒక్కసారిగా మూడుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు అప్పటిదాకా ముందు వరుసలో కూర్చున్న రేవంత్ రెడ్డి నాలుగో వరుసకు మారిపోయారు.












Click it and Unblock the Notifications