ప్రభుత్వం పిలిస్తే వెళ్తా: బీఆర్ఎస్‌లో చేరికపై ఈటల రాజేందర్ స్పష్టత..!!
అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును పలుమార్లు ప్రస్తావించారు. దీనితో ఆయన బీఆర్ఎస్‌లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. దీనిపై ఈటల స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ముగిశాయి. ఏడు రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను స్పృశించారు. ఈ క్రమంలో ఆయన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

కేసీఆర్ పేరు
తన ప్రసంగంలో కేసీఆర్ పలుమార్లు భారతీయ జనతా పార్టీకి చెందిన హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనితో ఈటల ఇక త్వరలో భారత్ రాష్ట్ర సమితిలో చేరొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. అసెంబ్లీ లాబీ, మీడియా పాయింట్ లో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈటల చేరికకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయిందని, ఆయన చేరిక లాంఛనప్రాయమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

క్లారిటీ ఇచ్చిన ఈటల..
దీనిపై ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లో చేరేది లేదని స్పష్టం చేశారు. నేను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నాననే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. స్వయంగా కేసీఆర్ పిలిచినా తాను గులాబీ కండువాను కప్పుకోబోనని తేల్చి చెప్పారు. ఇలాంటి మెతక మాటలకు ఈటల రాజేందర్ అనేవాడు పడిపోడు, పొంగిపోడు అని వివరించారు. 2004లో కూడా తనపై ఇలాగే దుష్ప్రచారం చేశారని, అప్పుడు టీఆర్ఎస్ ను వీడలేదు.. ఇప్పుడు బీజేపీని వీడట్లేదు.. అని పేర్కొన్నారు.

కేసీఆర్ ఖర్చు చేశారు..
తన ప్రతిష్ఠను దెబ్బ తీయడానికి కేసీఆర్ ఎంతో ఖర్చు పెట్టారని, పార్టీ నుంచి బయటికి పంపించడానికి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఈటల రాజేందర్ అన్నారు. దీన్ని ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. తనను మరింత డ్యామేజ్ చేయాలనే వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడారని ఈటల వ్యాఖ్యానించారు. పలకరించుకోవడం, పక్కన కూర్చున్నంత మాత్రాన పార్టీలు మారననే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు.

ఆ కల్చర్ నాది కాదు..
పార్టీలు మారే సంప్రదాయం తనకు లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గతంలో తాను టీఆర్ఎస్ ను వీడలేదని, పార్టీ వాళ్లే తనను బయటకు పంపించారని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారించడానికి, విద్యార్థులు ఎదుర్కొంటోన్న మెస్ ఛార్జీలపై సమావేశాలకూ ప్రభుత్వపరంగా కేసీఆర్ తనను పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని స్పష్టం చేశారు. సభలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినంత మాత్రాన పొంగిపోయే వ్యక్తిని కానని అన్నారు.

టీఆర్ఎస్ లో ఎలా పనిచేశానో..
గతంలో టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఓ సైనికుడిగా తాను పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశానని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీలో తాను కూడా అలాగే పని చేస్తానని పేర్కొన్నారు. తనకు వ్యక్తిగత ప్రయోజనాలు, సొంత అజెండా అంటూ ఏదీ లేదని, తెలంగాణ ప్రజల గొంతును మాత్రమే వినిపిస్తానని చెప్పారు. వారం రోజుల్లో బడ్జెట్ సమావేశాలను ముగించడం సరికాదని ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications