5న తెలంగాణ కేబినెట్ భేటీ: బడ్జెట్ ఆమోదం, నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 5న సమావేశం కానుంది. ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కానుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 5న సమావేశం కానుంది. ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఈ భేటీలో మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గదర్శనం చేస్తారు.

పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు.
కాగా, అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 3 అంటే శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ(శాసనసభా వ్యవహారాల సంఘం) సమావేశం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications