ఎమ్మెల్యే అభ్యర్థులు, ఓటర్లకు అలర్ట్: తెలంగాణ ఎన్నికలపై సీఈవో వికాస్ రాజ్ ఏం చెప్పారంటే?
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల (Telangana assembly elections) కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు విషయాలను వెల్లడించడంతోపాటు అభ్యర్థులు, ఓటర్లకు కీలక సూచనలు చేశారు.
ఓటు హక్కు లేనివారు అక్టోబర్ 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో మహిళ, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే 1950 నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ప్రభుత్వ వెబ్‌సైట్లలో నాయకుల ఫోటోలు తొలగించాలంటూ సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ప్రకటనలకు ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తేల్చిచెప్పారు. ఎన్నికల వేళ.. రాష్ట్రంలో నగదు లావాదేవీలు, మద్యం సరఫరాపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్యాయంగా 12 కార్డులను వినియోగించుకోవచ్చని తెలిపారు.
ప్రత్యేక అవసరాలుగల ఓటర్లకు.. రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలలో బ్రెయిలీ బ్యాలెట్ పత్రాలు కూడా ఉంటాయన్నారు. ఇక అఫిడవిట్లలో అన్ని కాలమ్స్‌ను అభ్యర్థులు ఖచ్చితంగా నింపాలన్నారు. లేదంటే తిరస్కరణకు గురవుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు.
నగదు ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు, వివరాలు ఉండాలన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల గుర్తింపు కసరత్తు జరుగుతోందన్నారు. నగదు లావాదేవీలు, మద్యం సరఫరాకు సంబంధించి పూర్తి పర్యవేక్షణ ఉంటుందని వికాస్ రాజ్ స్పష్టంచేశారు. బ్యాలెట్ పత్రాలపై గుర్తులతోపాటు అభ్యర్థుల ఫొటోలు కూడా ఉంటాయని తెలిపారు వికాస్ రాజ్.












Click it and Unblock the Notifications