ముస్లీంలు-మోడీ: కేసీఆర్ 'ఇంటెలిజెన్స్' వ్యాఖ్య, మనకు చెడ్డపేరు వద్దు
ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి చెందిన వ్యక్తి అని, తనకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయనకు ముస్లీంల నుంచి మద్దతు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అన్నారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి చెందిన వ్యక్తి అని, తనకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయనకు ముస్లీంల నుంచి మద్దతు ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు. నోట్ల రద్దు అంశంపై ఆయన ఈ రోజు మండలిలో మాట్లాడారు.

మోడీ టైం అడిగారు
నోట్ల రద్దు కష్టాలు తీరేందుకు యాభై రోజుల సమయం ఇవ్వాలని ప్రధాని మోడీయే చెప్పారన్నారు. వేయి అడుగుల ప్రయోజనమైనా, ఒక్క అడుగుతోనే మొదలు అవుతుందని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో వంద శాతం క్యాష్ లెస్ లేదన్నారు. కానీ అది ఉత్తమం అని అభిప్రాయపడ్డారు.

క్యాష్ లెస్
తెలంగాణలో ఇబ్రహీంపూర్ వంద శాతం క్యాష్ లెస్ గ్రామంగా మారిందన్నారు. రెండు వారాల్లో సిద్దిపేట క్యాష్ లెస్ అవుతుందన్నారు. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్‌కు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పారు. దేశంలో 15 లక్షల స్వైపింగ్ మిషన్లు ఉన్నాయని, ఇంకో పది లక్షలు అవసరమని చెప్పారు. అందుకే మొబైల్ ఆప్స్, చెక్కుల ద్వారా లావాదేవీలు జరగాలన్నారు.

మార్చుతానని మోడీ చెబుతున్నారు
పేదలు పేదలుగా, ధనవంతులు ధనవంతులుగానే ఉండాలా అన్నారు. ఈ వ్యవస్థ మారాలన్నారు. దానిని మార్చుతానని ప్రధాని మోడీ చెబుతున్నారన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గిన మాట వాస్తవమేనని, కానీ భయపడినంత తగ్గలేదన్నారు. త్వరలో టీ వ్యాలెట్ వస్తుందన్నారు.
నాడు తెలంగాణ కోసం దాదాపు రెండు నెలల పాటు అన్నింటిని బంద్ చేస్తే ప్రజలు సహకరించారన్నారు. నాడు తెలంగాణ కోసం సహకరించారని చెప్పారు. ఇప్పుడు నోట్ల రద్దు కూడా దేశం కోసమన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయన్నారు.

మనకు చెడ్డ పేరు వద్దు
మంచి పని జరుగుతుంటే ఎందుకు మద్దతు ఇవ్వవద్దన్నారు. మనకు 48 శాతం వ్యాట్ పెట్రోల్, డీజిల్ తదితర రంగాల పైనే ఉంటుందన్నారు.
నోట్ల రద్దు ప్రభావం వీటి పైన పడలేదన్నారు. మనం మంచి చేస్తే గెలుస్తామని, లేదంటే ఓడిపోతామన్నారు. అధికారంలో ఒకరు కాకుంటే మరొకరు ఉంటారని, కానీ ప్రజలు, దేశం శాశ్వతం అన్నారు. మోడీ మంచి పని చేస్తున్నారని, మనకు చెడ్డపేరు వద్దని, మనకు తోచిన సాయం మనం చేద్దామన్నారు.












Click it and Unblock the Notifications