బీఆర్ఎస్ కలిసి రాలేదబ్బా.. తెలంగాణా ఫ్లేవర్ పోయింది; అందుకే ఇలా: చర్చ!!
తెలంగాణలో రెండు దఫాలుగా అధికారాన్ని సాగించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు. అవమాన భారం భరించలేక రాజీనామా చేసి మరీ , ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు. అయితే కేసీఆర్ ఓటమికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కొక్కలా విశ్లేషిస్తున్నారు. కొంతమంది ఆయన కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడం కూడా కలిసి రాలేదని చెబుతున్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చి, ప్రజా మద్దతుతో అధికారాన్ని చేపట్టారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణ సెంటిమెంట్ తోనే సీఎం కెసిఆర్ అధికారంలోకి వచ్చి పాలన సాగించారు.

ఇక మూడో దఫా ఎన్నికలకు వెళ్లాల్సిన సమయంలో కెసిఆర్ దేశ్ కి నేతగా ఎదగాలని, టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేసి రాజకీయాలు మొదలుపెట్టారు. టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మార్చిన కేసీఆర్ దేశంలోని మిగతా రాష్ట్రాల పైన కూడా ఫోకస్ చేసి తెలంగాణను విస్మరించినట్లుగా చాలామంది భావించారు.
అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పేరులో తెలంగాణ ఉంది. కానీ భారత రాష్ట్ర సమితి అన్న పేరులో తెలంగాణ లేదు. ఇక తెలంగాణ సెంటిమెంటు లేదు అని భావించారు. తెలంగాణ ఫ్లేవర్ మిస్సైన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కనిపించిందని పలువురు చెప్తున్నారు .
రెండుసార్లు తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఈసారి సెంటిమెంట్ మంత్రాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్లలేదు. ఎందుకంటే ఒకవేళ అలా వెళ్ళినా పదేపదే తెలంగాణ సెంటిమెంటుతో ప్రజలు ఆదరిస్తారని భావన కేసీఆర్ కు లేదు. అయితే తెలంగాణలో పుట్టిన పార్టీగా కేవలం తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పే సాహసం కెసిఆర్ చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు కాబట్టి, కెసిఆర్ తెలంగాణ సెంటిమెంటుతో ప్రజలలోకి వెళ్లలేకపోయారు.
ఇదంతా విశ్లేషణ చేస్తున్న తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడమే కేసీఆర్ కొంప ముంచిందని చెబుతున్నారు. ఉట్టికెగరలేకున్నా స్వర్గానికి ఎగిరే ఆలోచనలు చేసినందుకు కేసీఆర్ కు షాక్ ఇచ్చారని పలువురు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications