అక్కా చెల్లెళ్లకు రాఖీ కానుక ఇచ్చిన తెలంగాణా ప్రభుత్వం!
తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందించడంతోపాటు, ఎంతోకాలంగా నిరుపేదలు ఎదురుచూస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో కూడా పేదలకు లబ్ది జరిగేలా ప్లాన్ చేసింది. శ్రావణమాసంలో అందులో రాఖీ పౌర్ణమి సందర్భంగా నిరుపేదలైన అక్కాచెల్లెళ్లకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ రెడ్డి తాజాగా హనుమకొండలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు అందించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలో బీఆర్ఎస్ మోసం: మంత్రి పొంగులేటి
పేదలకు ఆరేళ్లకు పైగా డబుల్ బెడ్ ఇండ్ల ఆశలు చూపి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి వద్ద అక్రమ వసూళ్లు చేసి పేదలను దోచుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రెండు ఎన్నికల్లో ఇవే ఇండ్లను చూపిస్తూ ఎవరికీ ఇవ్వలేదని, మూడోసారి కూడా మోసం చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రజలు తగు రీతిలో బుద్ది చెప్పారని ఆయన అన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు దగ్గరుండి మరీ గృహప్రవేశాలు
వరంగల్ జిల్లా హనుమకొండ బాల సముద్రంలో నేడు 592 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేసి మంత్రి పొంగులేటి దగ్గరుండి మరీ గృహ ప్రవేశాలు చేయించారు. అత్యంత ఆనందోత్సాహాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఎంతో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో కేవలం ఆ పార్టీ కార్యకర్తలకు , కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయని ఆరోపించారు.
పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి కట్టుబడిన ఇందిరమ్మ ప్రభుత్వం
గతంలో కట్టిన ఈ ఇండ్లను ఎందరో పేదలకు చూపించి అడ్డగోలుగా బి ఆర్ ఎస్ నేతలు వసూళ్లు చేసి ఎవరికీ ఒక్క ఇంటిని ఇవ్వలేదని ఆరోపించారు. అంతేగాక ఈ ఇండ్ల ఆశను చూపి ప్రతిసారి ఎన్నికల్లో లబ్దిపొందారని అయితే మూడోసారి వారి మోసాన్ని గమనించి పేదలు తగు బుద్ది చెప్పారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకే గాక పట్టణ పేదలకు గృహ వసతి కల్పించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అక్కచెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి కానుక
ఈ శ్రావణ మాస శుక్రవారం నాడు 592 మంది గృహ ప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఇండ్లు మహిళల పేరిటే మంజూరు చేశామని, ఒక రోజు ముందుగాను 592 మంది అక్కచెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి కానుక అందినట్లయిందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా సంక్షేమం - అభివృద్ది ప్రాతిపదికన ముందుకు సాగుతోందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది కమీషన్ల కక్కుర్తి
తాజాగా ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేయడం , ఇప్పటికే దశల వారీగా ఆరు హామీలను అమలు చేస్తున్న విషయం గమనించాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచేలా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బి ఆర్ ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తికి పాల్పడిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. వారి అవినీతి వల్లే కాళేశ్వరం కూలిందన్నారు.
దోచుకుంది దాచుకోటానికే ప్రభుత్వంపై దాడి
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల రూపాయిలు కేసీఆర్ కుటుంబానికి చేరాయన్నారు. దోచుకున్నది దాచుకోవడానికే బి ఆర్ ఎస్ నాయకులు తిరిగి అధికార ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారని విమర్శించారు. కాగా దేశంలో బిసీ కులగణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ,42 శాతం బీసీ కోటా అమలు చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications