టీనేజ్ బాలికల కోసం తెలంగాణా ప్రభుత్వ సరికొత్త ప్రయోగం.. తగ్గేదేలే!
తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విభిన్న వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను తీసుకువచ్చిన తెలంగాణ సర్కార్ కిషోర బాలికల కోసం కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే మహిళలను సమైక్యంగా ముందుకు నడిపించడం కోసం, వారికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేసి డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం.
కౌమార దశ బాలికల కోసం ఫ్రెండ్షిప్ గ్రూపులు
ప్రస్తుతం 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న కౌమార దశలో బాలికల కోసం ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ను ప్రారంభించింది. మహిళా స్వయం సహాయ బృందాల తరహాలోనే 15 నుంచి 18 ఏళ్ల లోపు కౌమార దశ లోని బాలికల కోసం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఫ్రెండ్సిప్ గ్రూప్స్ ప్రారంభించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క దీన్ని లాంఛనంగా ప్రారంభించారు.

కౌమార దశలో ఉన్న బాలికల సమస్యల పరిష్కారం కోసం నిర్ణయం
ఈ గ్రూప్ ల ద్వారా బాలికల్లో అవగాహనను, ఆత్మ విశ్వాసాన్ని, జీవన నైపుణ్యాలను పెంపొందించనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా అన్నారు. బాలికలు ఈ కార్యక్రమం ద్వారా సురక్షితంగా, ఆరోగ్యపరంగా ఎదిగి సమాజానికి సేవలందించగలరని పేర్కొన్నారు. కౌమార దశలో ఉన్న బాలికల సమస్యల పరిష్కారం కోసం, వారంతా కలిసికట్టుగా ఒకరి సమస్యలను ఒకరు స్నేహపూర్వకంగా చెప్పుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీటిపై కిశోర బాలికలకు అవగాహన
వారి ఆరోగ్య అవగాహన, మానసిక ఆరోగ్యం, పీరియడ్స్ సమయంలో శుభ్రత పైన శిక్షణ ఇవ్వడం కోసం గ్రూపులను ఏర్పాటు చేశారు. అంతేకాదు కిశోర బాలికలలో అనీమియా తగ్గింపు, సరైన పోషకాహారం మీద ప్రోత్సాహం ఇవ్వడానికి, సైబర్ భద్రత, ఆన్లైన్ దుర్వినియోగాల నివారణ, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ మేళాలు, ఆర్థిక స్వావలంబన వంటి కార్యక్రమాల పైన కూడా వీరికి అవగాహన కల్పిస్తారు.
ఈ బృందాల్లో సభ్యులుగా 19 లక్షల 13 వేల మంది కౌమార బాలికలు
ప్రతి యువతి సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని, వారిలో నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకొని స్నేహ సంఘాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల 13 వేల మంది కౌమార బాలికలు ఈ బృందాల్లో సభ్యులుగా ఉంటారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సెర్ఫ్ సీఈవో దివ్యా దేవరాజన్ కూడా పాల్గొన్నారు.
స్నేహ సంఘాల ఉద్దేశం ఇదే
ఇప్పటి వరకు 65 వేల 615 మంది బాలికలతో 6 వేల 138 ఫ్రెండ్సిప్ గ్రూప్ లు ఏర్పాటయ్యాయి. ప్రతి కిశోర బాలికను స్నేహ సంఘంలో చేర్చి వీరందరిని మంచి మార్గంలో ప్రయాణించేలా చేయడమే, గొప్పగా ఎదిగేలా చేయడమే ఈ స్నేహ సంఘాల యొక్క ఉద్దేశమని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications