మోడీ ఎఫెక్ట్, కేసీఆర్‌కు కరెన్సీ చిక్కులు: తెలంగాణపై పుండుమీద కారం
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం తెలంగాణ పైన బాగానే పడుతుందని తెలుస్తోంది. పెద్ద నోట్ల ప్రభావంతో రాష్ట్ర ఆదాయం తగ్గంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆదాయం సమకూరిన తర్వాత తిరిగి చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు అన్ని శాఖల రాబడి చాలా పడిపోయినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రతి నెల వచ్చే ఆదాయంలో సగం కూడా రాలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది.
అందులో ఉద్యోగులకు, పెన్షనర్లకు రూ.2,500 కోట్లు చెల్లించాలి. జీతాలకే మొత్తం పోతే ఖజానా ఖాళీ అవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో ఉద్యోగులకు సగం వేతనాలు వచ్చే అవకాశంపై ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల పూర్తి జీతం ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఇప్పుడున్న సమయంలో 25 శాతం నుంచి 50 శాతం వరకు కోత పెట్టి ఆదాయం సమకూరిన తర్వాత ఇవ్వనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల పైన ఈ ప్రభావం పడనుందని అంటున్నారు.
కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ విభాగాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి నెల ఉన్న దాని కంటే చాలా తక్కువ ఉంది. నోటు రద్దు నేపథ్యంలో ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే శాఖల్లో ఆదాయం పడిపోయింది. స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్లు, ఎక్సైజ్, వ్యాట్ ఆదాయం అనూహ్యంగా తగ్గింది.
ఈ నెల 9వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల్లో రూ.15 కోట్లు రావాల్సిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం కేవలం రూ.30 లక్షలు వచ్చింది. పుండుమీద కారం చల్లినట్లుగా ఇదే నెలలో కేంద్రం విడుదల చేసే పన్నుల వాటాలో రూ.480 కోట్లు కోత పడింది. దీంతో రాష్ట్ర ఆదాయం సగానికి సగం పడిపోయే ప్రమాదముందని, రూ.4 వేల కోట్లకు మించి వచ్చేలా లేదని సీఎంకు ఆర్థిక శాఖ అధికారులు చెప్పారని తెలుస్తోంది.
ఇందులో ప్రతి నెల విధిగా చెల్లించాల్సిన వడ్డీలు, వాయిదాలకు రూ.1,100 కోట్లు పోతే మిగతా సొమ్ము వేతనాలు కూడా చెల్లించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ సమయంలో జీతాలు పూర్తిగా చెల్లిస్తే ఇతరత్రా ఖర్చులన్నీ ఆగిపోతాయని, కనీస నిర్వహణ ఖర్చులకు డబ్బులు లేక ఖజానా ఖాళీ అవుతుందని లెక్కలు వేశారట. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు సగం ఇవ్వడమే మేలని భావించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications