బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! ఇక తాడోపేడో..!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయానికి తాజాగా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో స్థానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అదే సమయంలో బీసీ వర్గాల నుంచి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. బీసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం రేవంత్ సర్కార్ ను దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పాటు ఎన్నికల కోసం ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ను సైతం హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జీవో 9ను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును అధ్యయనం చేసిన ప్రభుత్వం.. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని తన పిటిషన్ లో రేవంత్ రెడ్డి సర్కార్ పేర్కొనబోతోంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా జనాభా గణన చేపట్టి రిజర్వేషన్లు కల్పించామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగానే జీవో నంబర్ 9 తీసుకొచ్చినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. కాబట్టి రిజర్వేషన్ల కోసం ఇచ్చిన జీవో 9ను కొట్టేయడం సరికాదని వాదించేందుకు సిద్దమవుతోంది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ముందే అప్పటికే హైకోర్టులో పిటిషన్లు వేసిన ఇద్దరు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తమ వాదనలు వినకుండా ప్రభుత్వ పిటిషన్ పై తీర్పు ఇవ్వొద్దంటూ కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరిగే విచారణ కీలకంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ణయంలో హైకోర్టు జోక్యాన్ని సుప్రీంకోర్టు ఎలా చూడబోతోందన్నది ఇక్కడ ప్రాధాన్యం కానుంది.












Click it and Unblock the Notifications