నూతన సంవత్సరం వేళ.. ప్రజా సమస్యలపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణా గవర్నర్ తమిళిసై
నూతన సంవత్సరం జరుపుకుంటున్న వేళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం పైన దృష్టి సారించిన ఆమె నేటి నుండి రాజ్ భవన్ లో దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

న్యూ ఇయర్ విషెస్ చెప్పిన తెలంగాణా గవర్నర్ .. కరోనాపై అలెర్ట్ గా ఉండాలని సూచన
నూతన సంవత్సర వేళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నగరంలోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాక్సిన్ వేసుకుని, మాస్కు ధరించి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గవర్నర్ పేర్కొన్నారు.

రాజ్ భవన్ లో నూతన సంవత్సర వేడుకల్లో గవర్నర్
ఈ ఏడాది కోవిడ్ అంతమవుతుందని భావిస్తున్నట్లుగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్ భవన్ లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, రాజ్ భవన్ సిబ్బందికి, రాష్ట్ర ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

20 మంది పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు , రాజ్ భవన్ వద్ద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు
న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ 20 మంది పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లను పంపిణీ చేశారు. వారిలో ఏడుగురు దివ్యాంగులు కాగా, 13 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులున్నారు.ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆమె నేటి నుండి రాజ్ భవన్ లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం గేటు వద్ద ఫిర్యాదులను స్వీకరించడానికి ఫిర్యాదుల బాక్స్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గవర్నర్ కు నేరుగా తమ సమస్యలను విన్నవించుకోవాలి అని భావిస్తున్న ప్రజలకు ఫిర్యాదులను చేసే అవకాశం కల్పిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకోవడం పై, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టిసారించారు.

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా రాజ్ భవన్ ఉంటుందన్న గవర్నర్
గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నేరుగా తమ సమస్యలను ఫిర్యాదుల బాక్స్ లో తమ ఫిర్యాదులను వేయడం ద్వారా గవర్నర్ కు విజ్ఞప్తి చేసుకునే వీలుంటుంది. అయితే ఫిర్యాదుల బాక్స్ గురించి మాట్లాడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల నుండి సలహాలను, ప్రజల సమస్యలను నేరుగా ఫిర్యాదుల బాక్స్ లో వేయొచ్చని పేర్కొన్నారు. అన్ని సమస్యలు పరిష్కారం కాకున్నా, తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా రాజ్ భవన్ పనిచేస్తుందని తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు.
Recommended Video

గవర్నర్ నిర్ణయంతో తెలంగాణా ప్రజల్లో హర్షం
గతంలోనూ తెలంగాణా గవర్నర్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవటానికి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళారు. అనేక మారుమూల ప్రాంతాలలో పర్యటించారు. మొదటి నుండి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇప్పుడు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించాలని తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు దశాబ్దాల నుండి పట్టించుకోని అనేక సమస్యలను గవర్నర్ పరిష్కరించే అవకాశం లేకపోలేదు అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications