ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో కొత్త ఇళ్ళ మంజూరుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. అయితే ఇంకా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చాలామంది ఇల్లు లేని నిరుపేదలు ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా వారందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో వేగం
ప్రజా పాలన దరఖాస్తుల ద్వారా తొలి విడతలో 3.60 లక్షల ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం మంజూరు చేసింది. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదులక్షల ఆర్థిక సహాయాన్ని చేసిన ప్రభుత్వం, నిర్మాణ దశను బట్టి వారానికి ఒకసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తుంది. జిల్లాల వారీగా కలెక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను, పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు.

మార్చి 31 లోపు అన్ని ఇళ్ళ గ్రౌండింగ్ పూర్తి చెయ్యాలని ఆదేశం
ఇప్పటికే అనేకచోట్ల ఇళ్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి.ఈ నెలాఖరు నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తొలిదశ మంజూరైన ఇళ్లకు గ్రౌండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుత 20 శాతం పనులు పూర్తి కాగా మార్చి 31వ తేదీ లోపు అన్ని ఇళ్ల గ్రౌండింగ్ ముగించాలని జూన్ చివరి నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా లబ్ధిదారులను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రెండో జాబితా విడుదలకు నిర్ణయం
ఇదే సమయంలో రెండవ దశ జాబితా విడుదలపైన వేగం పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో కొత్త ఇళ్లను మంజూరు చేయాలని పేర్కొంది. అంతకుముందే తొలి దిశ గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవి మాత్రమే కాదు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంపైన కూడా కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మార్చి 31వ తేదీ లోపు లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో కొత్త ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో స్థలం కూడా లేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న క్రమంలో ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.












Click it and Unblock the Notifications