గవర్నమెంట్ టీచర్లను అమెరికా పంపిస్తున్న తెలంగాణా ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోండి!
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులలో నైపుణ్యాలను పెంపొందించడానికి, అంతర్జాతీయ స్థాయిలో వారిని బెస్ట్ టీచర్లుగా తీర్చిదిద్దడానికి వారిని యూఎస్ పంపించి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రాం కింద వారికి అమెరికాలో శిక్షణ ఇప్పించడానికి నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ టీచర్లకు అమెరికాలో శిక్షణ
ఈ మేరకు 2026 27 విద్యా సంవత్సరం కి సంబంధించిన దరఖాస్తులను మార్చి 6వ తేదీ వరకు స్వీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రభుత్వ టీచర్లు అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు.ఈ ప్రోగ్రాం కింద ఫెలోషిప్ కు ఎంపికైన వారికి అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలలో ఆరు వారాల పాటు ప్రత్యేక అకడమిక్ శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆన్ డ్యూటీ గానే పరిగణిస్తుంది.

ఫెలోషిప్ కి ఎంపికైన వారికి అన్నీ ఖర్చులు ప్రభుత్వానివే
అంతేకాదు అమెరికాకు రాకపోకలతో పాటు, అక్కడ బస చేయడానికి, వారికి సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఎవరైతే ఈ ప్రోగ్రాం కింద ఫెలోషిప్ కు ఎంపిక చేయబడతారో వారికి వీసా, విమాన టిక్కెట్లు, వసతి, భోజనం, హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు రోజువారి అలవెన్స్ కూడా అందిస్తారు. ఇది ఉపాధ్యాయులపైన ఎటువంటి అదనపు భారాన్ని, ఆర్థిక భారాన్ని పడకుండా చేస్తుంది.
దరఖాస్తుకు అర్హులు వీరే
అయితే ఈ ప్రోగ్రాం కింద దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బోధించే వారై ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారు ఇంగ్లీష్ భాషలో పట్టు ఉన్న వారై ఉండాలి. దీనికోసం దరఖాస్తు చేసుకునేవారు కనీసం ఐదేళ్ళ బోధనా అనుభవం ఉండాలి. ముఖ్యంగా ఇంగ్లిష్, సోషల్, మ్యాథ్స్, సైన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ లు బోధించే టీచర్ లకు ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
ఆ పరీక్షలో 45శాతం మార్కులు తప్పనిసరి
ఎంపిక ప్రక్రియలో భాగంగా టోఫెల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో కనీసం 45శాతం మార్కులు సాధించటం తప్పనిసరి. యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇన్ ఫెలోషిప్ ను నిర్వహిస్తోంది. ఆసక్తిగల ప్రభుత్వ ఉద్యోగులు www.usief.org.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 6వ తేదీ చివరి తేదీగా పేర్కొన్నారు.
ఎంపికైన వారికి రెండు విడతలుగా అమెరికాలో శిక్షణ
ఎంపికైన వారికి వచ్చే సంవత్సరం జనవరి లేదా సెప్టెంబర్ లో రెండు విడతలుగా అమెరికాలో శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణలో అక్కడ బోధన విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, సబ్జెక్ట్ నాలెడ్జ్ కు సంబంధించిన అనేక అంశాల పైన శిక్షణ ఇస్తారు.












Click it and Unblock the Notifications