విద్యార్థులకు భారీ శుభవార్త.. తొలిసారి కాలేజ్ స్టూడెంట్స్ కు సైతం బ్రాండెడ్ కిట్స్!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలు, వివిధ గురుకులాలు కస్తూర్బా గాంధీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులందరికీ బ్రాండెడ్ నాణ్యతతో కూడిన కిట్లను సరఫరా చేయనుంది. ఈ బ్రాండెడ్ కిట్లు వారికి నాణ్యమైన పాఠ్య వనరులను అందిస్తాయి.
27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే భారీ ప్రాజెక్ట్
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 687.78 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా సుమారు 27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ కిట్లలో రెండు జతల యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, టైలు, బెల్టులు వంటి అనేక అంశాలు ఉంటాయి. అంతేకాకుండా బెడ్డింగ్ సామగ్రి, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు వంటి ఇతర అవసరమైన వస్తువులను కూడా అందజేయనున్నారు.

విద్యార్థులందరికీ బ్రాండెడ్ యూనిఫాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నాణ్యతకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల పంపిణీలో ఎలాంటి తేడాలు లేకుండా అందరు విద్యార్థులకు సమానంగా బ్రాండెడ్ వస్తువులు అందుతాయి. ఈ సంవత్సరం యూనిఫాం రంగుల్లో కూడా ముఖ్యమైన మార్పులు చేశారు. డే స్కాలర్స్‌కు టాప్ లైట్ బ్లూ, లోయర్ డార్క్ బ్లూ రంగులు, గురుకుల విద్యార్థులకు మెరూన్ చెక్ టాప్, మెరూన్ లోయర్ రంగులు కేటాయించారు.
యూనీఫాం లు కుట్టే పని మహిళా సంఘాలకు
విద్యార్థినులకు స్కర్ట్, పంజాబీ డ్రెస్, చున్నీలు కూడా అందించనున్నారు. యూనిఫాంల కుట్టు పనులను పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించారు. రోజుకు 75వేల నుంచి ఒక లక్ష యూనిఫాంలు కుట్టగల సామర్థ్యం ఉన్న ఈ సంఘాలకు ఒక్కో యూనిఫాంకు రూ.75 చొప్పున చెల్లింపు జరుగుతుంది. దీని ఫలితంగా మహిళా సంఘాలకు సుమారు రూ.40కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
చేనేత కార్మికులకు ప్రోత్సాహం
ఇక స్థానిక చేనేత కార్మికులను ప్రోత్సహించడం కోసం యూనిఫాం మరియు బెడ్డింగ్ ఆర్డర్లలో 25 నుంచి 30 శాతం వరకు రాష్ట్ర చేనేత సహకార సంఘాలకు కేటాయించారు. ఇందులో 56 లక్షల మీటర్ల వస్త్రం, 6.5 లక్షల దుప్పట్లు, 3 లక్షల బెడ్ షీట్లు, 2.29 లక్షల కార్పెట్లు వంటివి ఉన్నాయి. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల తయారీని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు అప్పగించారు.
2 లక్షల మంది విద్యార్థులకు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు బ్రాండెడ్ కిట్ లు
పాఠశాల విద్యార్థులతో పాటు జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగులు, బెల్టులు, టైలు, నల్ల బూట్లు, సాక్సులు ఉచితంగా అందించడం ఇందులో ప్రత్యేకత. పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయని, త్వరలోనే పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.ఈ కార్యక్రమం ద్వారా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ విద్యార్థులు కూడా నాణ్యమైన వస్తువులతో చదువుకునే అవకాశం లభిస్తుంది.












Click it and Unblock the Notifications