5లక్షల బీమాతో పాటు సామాన్యులకు భారీ వరాలు.. జూన్ 2 ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విభిన్న వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ వరాలను ప్రకటించబోతోంది. జూన్ 2న రానున్న తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని యంత్రాంగం సరికొత్త సంక్షేమ పథకాల అమలుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చే పలు నిర్ణయాలను ఆ రోజే అధికారికంగా వెల్లడించనున్నారు.
రూ. 5లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వీటికి సంబంధించిన తుది విధివిధానాలు ఖరారు కానున్నాయి. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ధ్యేయంగా రేవంత్ ప్రభుత్వం 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం కింద నమోదైన లబ్ధిదారులకు రూ. 5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇందుకోసం సర్కారు సుమారు రూ. 4 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది.

కొత్త పెన్షనర్ లు పండుగ చేసుకునే రోజు
జూన్ 2వ తేదీన ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' (LIC) అధికారుల మధ్య ఈ ప్రాజెక్టుపై అధికారిక ఒప్పందం జరగనుంది. అంతేకాదు చాలా కాలంగా సామాజిక పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ఈ ఆవిర్భావ దినోత్సవం తీపి కబురు అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జూన్ 2 నుంచే ఇందిరమ్మ రెండో విడత నిధులు ఖాతాల్లో
దీనితో పాటు, సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే నిరుపేదల కోసం ఉద్దేశించిన 'ఇందిరమ్మ ఇండ్లు' పథకం రెండవ విడతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జూన్ 2 నుంచే ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి గృహ నిర్మాణ ఆర్థిక సహాయ నిధులు విడుదల కానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ, జూన్ 2 నుండి పూర్తి స్థాయి డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
డిజిటల్ హెల్త్ కార్డులు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్య సేవలు పొందేలా 'ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్' ద్వారా డిజిటల్ హెల్త్ కార్డుల వసతి కల్పిస్తున్నారు. మరోవైపు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో వీరికి ఉదయం పూట అల్పాహారం కూడా అందించే యోచనలో యంత్రాంగం ఉంది.
జూన్ 2 నుండే సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 'సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్' జూన్ 2న ప్రారంభం కానుంది. దీని ద్వారా అభ్యర్థులకు విదేశాలలో ఉద్యోగాలు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అదే రోజున హైదరాబాద్‌లోని సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పాక్షికంగా వైద్య సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.













Click it and Unblock the Notifications