భూముల మార్కెట్ విలువ పెంపు, ఎక్కడ ఎంత..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అమలుకు సిద్దమైంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచాలని డిసైడ్ అయింది. ముందుగా కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్‌ఆర్ లోపల) పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిద్దం అవుతోంది. ఈ మేరకు వచ్చే కేబినెట్ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. దీని పైన సీఎం రేవంత్ అధికారులకు మార్గనిర్దేశం చేసారు.
కీలక ప్రతిపాదన
ముఖ్యమంత్రి రేవంత మరో కీలక ప్రతిపాదన చేసారు. క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత భూముల విలువలను పెంచుదామని పేర్కొన్నారు. తొలుత కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్‌ఆర్ లోపల) పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోర్ అర్బన్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతం మీద సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. భూముల విలువల పెంపుపై జిల్లా కమిటీల నుంచి నివేదికలు వచ్చాక.. వాటిపై రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

రెండు రెట్లు మేర
విలువల పెంపును కోర్ అర్బన్ రీజియన్‌లో తొలుత అమలు చేసి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ భూముల విలువలు ఇప్పటికీ కోర్ అర్బన్ రీజియన్‌లో ఎకరా రూ.20 లక్షలు ఉందని.. బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఎకరా రూ.10-20 కోట్ల మధ్య ఉందనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇలాంటి విలువలను రెండు, మూడు రెట్లు వరకు పెంచాలనే దానిపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ధరల పైనా
కాగా, ఓఆర్‌ఆర్ లోపల చాలా ప్రాంతాల్లో గజం భూమి ధర (రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూ) రూ.2000-2500 లోపు ఉందని, అదే భూమి గజం రూ.30-50వేల మధ్య విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు వివరించినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, కలెక్టర్ల నుంచి తెప్పించే నివేదికల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా భూములకు భూధార్‌నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వారసత్వ, ఇతర మ్యుటేషన్ల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications