ఫ్యూచర్ సిటీకి జైపాల్ రెడ్డి పేరు - జిల్లాల సరిహద్దుల మార్పు, కొత్తగా ఇక..!?
తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణను చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు పైన కసరత్తు కొనసాగుతోంది. దానికి జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని దాదాపుగా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీతో పాటుగా రంగారెడ్డి జిల్లాను కూడా పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉంది. దీంతో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.
తెలంగాణ పరిపాలనా ముఖచిత్రంలో మరో కీలక మార్పునకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి స్మారకార్థం ఆయన పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఫ్యూచర్‌సిటీ'ని కేంద్రంగా చేసుకుని ఈ సరికొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లో ఇప్పటికే మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలోకి వచ్చే ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్, కొత్తూరు, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాలతో పాటు జైపాల్‌రెడ్డి స్వగ్రామమైన మాడ్గుల కూడా ఈ పరిధిలోనే ఉండటంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. జైపాల్‌రెడ్డి జిల్లా పరిధిలోకి దాదాపు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పరిసర ప్రాంతాలను చేర్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సరిహద్దుల్లోనూ మార్పులు..!
అదే విధంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండే అవకాశం ఉంది. హయత్‌నగర్ ప్రాంతంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అవతల ఉన్న కొత్తూరు, పెద్దషాపూర్ తదితర ప్రాంతాలను ఇందులో కలపనున్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో మహేశ్వరం నుంచి 28, కందుకూరు నుంచి 9 గ్రామాలు చేర్చగా, మహేశ్వరం మండలం మొత్తాన్ని ఇందులో కలపాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాను కూడా పునర్ వ్యవస్థీకరించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు 10 జిల్లాలుండగా, 2016లో కొత్తగా 21 జిల్లాలు ఏర్పడ్డాయి. 2019లో ములుగు, నారాయణపేట ఏర్పాటుతో ఆ సంఖ్య 33కు చేరింది. సీఎం ప్రకటించిన కమిషన్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణను చేపట్టనుంది.













Click it and Unblock the Notifications
