తెలంగాణ ప్రభుత్వంలో వీరిద్దరికీ భలే ఆఫర్లు..!!
Kavya Maran: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం ఇదివరకే స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది. మరుగున ఉన్న గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేలా ఈ విధానాన్ని రూపొందించింది.
క్రీడల్లో రాజకీయ జోక్యానికి పుల్ స్టాప్ పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్- పబ్లిక్- పార్ట్ నర్ షిప్ కు పెద్దపీట వేసింది. క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ అత్యుత్తమ ఫలితాలను అందిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని ఆహ్వానించే ఒక బోర్డును ఏర్పాటు చేసింది.

స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది. మాజీ క్రీడాకారులు, క్రీడారంగంలో రాణిస్తోన్న పలువురు పారిశ్రామికవేత్తలకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ లో చోటు లభించింది.
ఆర్పీ- సంజీవ్ గోయెంకా గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్ డాక్టర్ సంజీవ్ గోయెంకా దీనికి అధిపతిగా వ్యవహరిస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్.. ఆయనకు చెందినదే. ఈ బోర్డుకు యూఆర్ లైఫ్ చీఫ్ ఉపాసన కామినేని.. ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
విటా దాణి- దాణి ఫౌండేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ చీఫ్ కావ్యా మారన్- సన్ టీవీ నెట్ వర్క్, సీ శశిధర్- విశావా సముద్ర, పుల్లెల గోపీచంద్- బ్యాడ్మింటన్, రవికాంత్ రెడ్డి (వాలీబాల్), బైఛుంగ్ భూటియా- ఫుట్ బాల్, అభినవ్ భింద్ర- షూటింగ్, కపిల్ దేవ్- క్రికెట్ ఈ గవర్నెన్స్ లో సభ్యులుగా నియమితులయ్యారు.
బియ్యాల వెంకట పాపారావు, ఇంజేటి శ్రీనివాస్.. స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్లుగా వ్యవహరిస్తారు. తెలంగాణ క్రీడా రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ఈ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కృషి చేయాల్సి ఉంటుంది. పాఠశాలల్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల్లో గల నైపుణ్యాలను గుర్తించడానికి క్యాంప్ లను ఏర్పాటు చేస్తుంది.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లో క్రీడలను భాగస్వామ్యం చేసింది ప్రభుత్వం. దీనికోసం ఓ ప్రత్యేక చాప్టర్ సైతం పెట్టింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రారంభించనుంది. కోచ్ ల కోసం దక్షిణ కొరియా యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది.
ఒలింపిక్స్ వంటి అత్యుత్తమ క్రీడా వేదికలపైరాణించిన వారికి ప్రభుత్వం ఇంటి స్థలాలు, నగదు ప్రోత్సహకాలు, ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. క్రీడల వల్ల యువతను మాదక ద్రవ్యాల ఊబి నుంచి కూడా రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications