అదంతా తావీజ్ మహిమ... మరోమారు తెలంగాణా హెల్త్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
కాంట్రవర్సీ లకు కేరాఫ్ అయిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డైరెక్టర్ గా ఒక ఉన్నత పదవిలో ఉన్న ఆయన గతంలోనూ అనేకమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఒక ఇఫ్తార్ పార్టీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చిన్నతనంలో తాను తనకు కట్టిన తాయత్తు వల్లే బతికి ఉన్నానని, ఆ తావీజ్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు ఆయన పొలిటికల్ ఎంట్రీ పైన కూడా వ్యాఖ్యలు చేశారు.

ప్రజాసేవ చేయడమే నిజమైన రాజకీయ జీవితం అని వ్యాఖ్యానించిన ఆయన కెసిఆర్ కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికలలో కొత్తగూడెంలో పోటీ చేస్తానని వెల్లడించారు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అప్పట్లో కరోనా ఏసుక్రీస్తు దయవల్లే తగ్గిందంటూ వ్యాఖ్యలు చేశారు. మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పడం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తుంది.
ఇక హెల్త్ డైరెక్టర్ ఇటువంటి కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన సీఎం కేసీఆర్ తనకు పితృ సమానులని చెబుతూ కెసిఆర్ పాదాలు తాకడం వివాదాస్పదమైంది. ఆపై కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వైద్యులు, వైద్య సిబ్బంది విశేషంగా సేవలందిస్తే, హెల్త్ డైరెక్టర్ గా ఉన్న శ్రీనివాస రావు మాత్రం ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందని వ్యాఖ్యలు చేశారు.
వరుసగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తాయత్తు వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడారు. దీంతో హేతువాదులు హెల్త్ డైరెక్టర్ గా ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications