ఇదేమైనా చాక్లెట్టా... పద్ధతి లేదా: కేంద్రంపై కేటీఆర్, బెంగళూరుతో కాదు
హైదరాబాద్: ఐటీ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాలపై ఊదరగొట్టి హైదరాబాద్‌కు కేటాయించిన ప్రతిష్ఠాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం నాడు తప్పుబట్టారు.
ఈ ప్రాజెక్టుపై కేంద్రానికి స్పష్టత లేదనీ, అంతా గందరగోళంగా ఉందన్నారు. అయినా వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలో పది లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ ఐటీ శాఖ పనితీరుపై వార్షిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే.
రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడి, సుమారు 30 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని చెప్పిన ఐటీఐఆర్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి గందరగోళంగా ఉందని, వీటిపై అడిగితే కనీస స్పందన ఉండడం లేదన్నారు. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో కూడా కొన్నిసార్లు సమావేశమయ్యానని తెలిపారు.
ఐటీఐఆర్ విధానాన్ని మళ్లీ కేబినెట్ ముందు ఉంచాలనుకుంటున్నామన్నారు. ఐటీఐఆర్ కింద మనకు రూ.3వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే కేవలం రూ.65 కోట్లు ఇచ్చారని, దీనిని ఏమనుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్రాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందన్నారు.

కటక్‌కు కూడా ఐటీఐఆర్ ఇస్తున్నట్లు ప్రకటించారని, ఐటీఐఆర్ అంటే చాక్లెట్లా? పిప్పర్‌మెంటా? కేటాయింపుల్లో ఓ పద్ధతంటూ ఉండాలని ధ్వజమెత్తారు. బెంగళూరు, పుణె, హైదరాబాద్, గుర్గావ్‌లాంటివి ఐటీకి కేంద్రాలుగా ఎదిగాయని, ఐటీలో రాణిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి తగినంత ప్రోత్సాహం లభించడం లేదన్నారు. కేంద్రం ఐటీఐఆర్ కింద సహకరించినా, సహకరించకున్నా తెలంగాణలో ఐటీ అభివృద్ధి ఆగదన్నారు.
ఐటీ రంగంలో తమ పోటీ బెంగళూరుతోనో మరో నగరంతోనే కాదన్నారు. ప్రపంచంతోనే పోటీ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు తెలంగాణ కేంద్రమైందని, టీ హబ్ తెలంగాణకు బ్రాండుగా మారిందని చెప్పారు. స్టార్టప్‌లకు మూలకేంద్రమైన సిలికాన్ వ్యాలీలో టి హబ్ ఔట్ పోస్టును త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం మధ్య ఉన్న ఇబ్బందులు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని కేటీఆర్ అన్నారు. వీటిని సరిదిద్దుకుంటున్నామని చెప్పారు. మిషన్ భగీరథలో భాగంగా ఫైబర్‌గ్రిడ్ వేయలేకపోవడానికి కారణం అదే అన్నారు.
హైదరాబాద్‌లో ఉచిత వైఫైకి 3వేల హాట్‌స్పాట్లను గుర్తించామని, ఇప్పటికే ఆరంభించిన ప్రాంతాల్లో అది అంతగా విజయవంతం కాలేదన్నారు. కారణం సర్వీస్ ప్రొవైడర్లు తమకు లాభం రావడం లేదంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వంగానీ, జీహెచ్‌ఎంసీగానీ భరించేలా ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications