గవర్నర్‌ను కలిసిన 'టీ' లాయర్లు: డిమాండ్లివే, రాజేంద్ర‌న‌గ‌ర్ కోర్టులో ఉద్రిక్తత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఈ అంశంపై తెలంగాణ న్యాయవాదులు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు, డిమాండ్ల గురించి గవర్నర్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో హైకోర్టు ఏర్పాటు, న్యాయధికారుల ఆప్షన్ల రద్దు అంశాలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ లాయర్లు గవర్నర్‌కు వివరించారు. సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారులు, ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

హైకోర్టు విభజన జరగకపోవడంతో తెలంగాణకు చెందిన న్యాయాధికారులకు, ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గవర్నర్‌కు లేఖ అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ లాయర్లు ఉమ్మడి హైకోర్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అన్నారు.

గవర్నర్ నరసింహాన్ ముందు మూడు డిమాండ్లను ఉంచినట్లు తెలిపారు. తమ డిమాండ్లను గవర్నర్ నరసింహాన్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. తమ డిమాండ్లకు ఖచ్చితమైన హామీ వచ్చిన తర్వాతే విధుల్లోకి చేరతామని తెలంగాణ లాయర్లు స్పష్టం చేశారు.

lawyers

మరోవైపు హైకోర్టు విభజన అంశంపై ఆదివారం తెలంగాణ న్యాయవాద సంఘాల ప్రతినిధులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) టిఎస్ ఠాకూర్‌ని కలిసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఠాకూర్‌ను ఆయన నివాసంలో కలిసి న్యాయవాదుల నిరసనలు, సస్పెన్షన్‌కు దారితీసిన పరిస్థితులను వివరించారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన హైకోర్టుకు సంబంధించిన అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని, నిరసనలను మానుకోవాలని తెలంగాణ న్యాయవాద సంఘాల ప్రతినిధులకు సూచించారు.

న్యాయవాదుల డిమాండ్లివే:

1. కింది కోర్టుల్లోని న్యాయాధికారులను ఏపీ, తెలంగాణలకు తాత్కాలికంగా కేటాయిస్తూ ఉమ్మడి హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలి. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 77, 80 ప్రకారం తదుపరి కసరత్తు పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలి.
2. న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగుల సస్పెన్షన్‌ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలి.
3. ఎలాంటి జాప్యం లేకుండా ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
4. ప్రస్తుత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని వేరే హైకోర్టుకు బదిలీ చేయాలి.

రాజేంద్ర‌న‌గ‌ర్ కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య తోపులాట

ఇదిలా ఉంటే సోమవారం ఉదయం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి ఎనిమిద‌వ‌ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన న్యాయవాదులు కొందరు సస్పెన్షన్‌కు గురైన న్యాయాధికారులకు అనుకూలంగా కోర్టు ఆవరణలో ఆందోళనను కొనసాగించారు.

అదే సమయంలో కోర్టులో విధుల‌కు హాజ‌రవుతోన్న న్యాయ‌మూర్తుల‌ను న్యాయ‌వాదులు అడ్డుకున్నారు. కోర్టుకు వెళ్ల‌వ‌ద్ద‌ని నినాదాలు చేశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. న్యాయ‌వాదుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. దీంతో పోలీసులు, న్యాయ‌వాదులకు మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana lawyers met governor narasimhan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి