తెలంగాణలో తగ్గని ఉధృతి: క్వారంటైన్లు, ఐసొలేషన్లలో వేలాదిమంది: 97 వేలకు పైగా
హైదరాబాద్: తెలంగాణపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కొద్దిరోజులుగా కాస్తో, కూస్తో తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన పాజిటివ్ కేసులు.. మళ్లీ మొదటికొచ్చాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. వేలాదిమంది కరోనా వైరస్ పేషెంట్లు హోమ్ క్వారంటైన్లు, ఐసొలేషన్లలో కాలం గడపాల్సి వస్తోంది. రోజురోజుకూ కొత్తగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్ కేసులతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి. పాజిటివ్ కేసుల్లో రోజువారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువ అవుతోంది.
తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 1724 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 1195 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 97,424లకు చేరుకుంది. ఇందులో 75,186 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 729కి చేరుకుంది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 21,509గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 15,076 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం బులెటిన్‌ను విడుదల చేసింది.

తాజా వివరాల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 గంటల్లో కొత్తగా 395 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వరంగల్ అర్బన్‌లో వందకు చేరువగా రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-17, భద్రాద్రి కొత్తగూడెం-27, జగిత్యాల-35, జనగామ-13, జయశంకర్ భూపాలపల్లి-7, జోగుళాంబ గద్వాల-37, కామారెడ్డి-32, కరీంనగర్-101, ఖమ్మం-42, కొమరంభీమ్ ఆసిఫాబాద్-7, మహబూబ్ నగర్-32, మహబూబాబాద్-28, మంచిర్యాల-45, మెదక్-34, మేడ్చల్ మల్కాజ్‌గిరి-105, ములుగు-11, నాగర్ కర్నూలు-22, నల్లగొండ-67, నారాయణ పేట్-9, నిర్మల్-23, నిజామాబాద్-61, పెద్దపల్లి-43, రాజన్న సిరిసిల్ల- 37, రంగారెడ్డి-169, సంగారెడ్డి-45, సిద్ధిపేట్-61, సూర్యాపేట్-44, వికారాబాాద్-14, వనపర్తి-28, వరంగల్ రూరల్-32, వరంగల్ అర్బన్-91, యాదగిరి భువనగిరి-10 కేసులు నమోదు అయ్యాయి.
24 గంటల వ్యవధిలో మొత్తం 23,841 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 8,21,311కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 22,122 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాలు 1076 ఉన్నాయి. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications