తెలంగాణా స్కూల్స్ రీ ఓపెన్ : మధ్యంతర ఉత్తర్వులతో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు బ్రేక్; తెలంగాణా సర్కార్ కు షాక్ !!
తెలంగాణ స్కూల్స్ రీ ఓపెనింగ్ పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు స్కూల్స్ పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వ జీవోపై స్టే విధించింది. తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్ళ పునః ప్రారంభానికి తాత్కాలిక బ్రేక్ వేసింది హైకోర్టు. రేపటి నుండి పాఠశాలలను ప్రారంభించవద్దని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో హైకోర్టు విధించిన స్టే తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చింది.

ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశాలు
తెలంగాణ హైకోర్టులో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్ నమోదైన నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరు కావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశాలను జారీ చేసింది. తరగతులకు హాజరు కాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని, అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై కూడా ఎటువంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. పిల్లలను స్కూల్స్ కు పంపటంపై తల్లిదండ్రులదే నిర్ణయాధికారం అని పేర్కొంది. ఇదే సమయంలో గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించ వద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రైవేట్ ఉపాధ్యాయుడు దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ
ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల పునఃప్రారంభంపై, పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యాబోధనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందని, కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న కారణంగా ఇప్పుడు ప్రత్యక్ష విద్యాబోధన సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా విద్యాసంస్థలను ప్రారంభించడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు.

మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం చెప్పిందిదే
ఇక నేడు పిటిషన్ పై విచారణ జరిపిన తాత్కాలిక సీజే రామచంద్రరావు ధర్మాసనం ప్రత్యేక హోదా పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్లో బోధన జరపాలా, ప్రత్యక్ష బోధన చెయ్యాలా అన్న దానిపై విద్యా సంస్థలు నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వం జారీ చేసిన జీవో పై వారంరోజుల స్టే విధిస్తూ, వారం రోజుల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించే పాఠశాలలకు కరోనా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించవలసిన కరోనా మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని కూడా సూచించింది. గురుకులాలు మరియు హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని, వసతులు పరిశీలించిన తర్వాతనే నిర్వహించాలా వద్దా అనేది నిర్ణయిస్తామని వెల్లడించింది.

తదుపరి విచారణ ఆక్టోబర్ 4వ తేదీకి వాయిదా
ప్రత్యక్ష బోధన పై పరస్పర విరుద్ద లాభనష్టాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్రంలో ఇంకా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొవిడ్ మూడవ దశ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో దానిని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారని అభిప్రాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం రెండింటినీ సమన్వయం చేసి చూడాలని అభిప్రాయం వ్యక్తం చేసింది . ఈ పిటిషన్ పై తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చెయ్యటంతో వారం రోజుల పాటు ప్రభుత్వ జీవోపై స్టే విధించటంతో స్కూల్స్ పునః ప్రారంభం వారం రోజులపాటు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications