విద్యుత్ బకాయిల ఏకపక్ష నిర్ణయంపై కేంద్రానికి లేఖ రాయనున్న తెలంగాణా.. కేంద్రం స్పందిస్తుందా!!
తెలంగాణ రాష్ట్ర డిస్కంలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 6700 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అయితే దీనిపై తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కేంద్రం తీరుపై విమర్శలు చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మండిపడుతోంది. కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా కక్షపూరిటంగా ఈ చర్యకు దిగిందని తెలంగాణా ప్రభుత్వం ఆరోపిస్తుంది.

ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్ర ఆదేశంపై తెలంగాణా ప్రభుత్వం సీరియస్
బిజెపి ప్రభుత్వం తాజాగా 6,700 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడం కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి కాదని ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. విద్యుత్ రంగంలోతాము సాధించలేని ప్రగతి, సీఎం కేసీఆర్ సాధించడంతో ఓర్వలేకనే కేంద్ర ఈ తరహా నిర్ణయం తీసుకుందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్రం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఏపీ నుండి తెలంగాణాకు రావాల్సిన బకాయిల మాటేంటి? కేంద్రానికి తెలంగాణా లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు 12,941 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని, దీనిపై ఎన్నిసార్లు లేఖలు రాసిన కేంద్రం స్పందించలేదని పేర్కొన్న మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై చట్టబద్ధ సంస్థలని అప్రోచ్ అవుతామని స్పష్టం చేశారు. అంతేకాదు మరోవైపు ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నట్టు అభిప్రాయానికి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ సంస్థల వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వడం సరికాదని మరోమారు కేంద్ర విద్యుత్ శాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది.

తెలంగాణా ప్రభుత్వ లేఖపై కేంద్రం స్పందిస్తుందా?
ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రాసిన అనేక లేఖలు కేంద్రం వద్ద బుట్టదాఖలు అయ్యాయని రాష్ట్ర మంత్రులే చెప్తున్న నేపథ్యంలో తాజాగా మరోమారు కేంద్రానికి లేఖ రాస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది ప్రశ్నార్థకమే. ఏది ఏమైనా కేంద్రం తాజాగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన షాక్ మామూలు షాక్ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications