రాకేశ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత : రాళ్ల దాడి - నిప్పు పెట్టేయత్నం..!!
అగ్నిపథ్ నిరసనల్లో పోలీసు కాల్పుల్లో మరణించిన రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. యాత్ర కొనసాగుతుండగా ఒక్క సారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు.. అంతిమ యాత్రలో పాల్గొంటూ... బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పైన రాళ్ల దాడి చేసారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై దాడికి దిగటంతో పాటుగాకార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టారు. అయితే, ముందుగానే భారీ స్థాయిలో పోలీసులు అంతిమయాత్రను అనుసరించారు. వెంటనే ఆందోళన కారులను నియంత్రించారు.
కార్యాలయం లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మంటలను ఆర్పివేసారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగిన నిరసనల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ పాల్గొన్నారు. రాకేశ్ తొలి నుంచి సైన్యంలో చేరాలని ఆశతో పరీక్షకు సిద్దం అయ్యారు. రాకేశ్ సోదరి సైతం బీఎస్ఎఫ్ లో పని చేస్తున్నారు. అయితే, సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగిన నిరసనలో విధ్వంసం చోటు చేసుకోవటంతో పోలీసులు కాల్పులకు దిగారు. అందులో రాకేశ్ మరణించారు. పోలీసుల కాల్పుల్లో గాయపడి అచేతనంగా ఉన్న రాకేశ్ ను తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అయితే, అప్పటికే రాకేశ్ మరణించినట్లుగా వైద్యులు నిర్దారించారు. దీంతో.. కుటుంబ సభ్యులు గాంధీ నుంచి రాకేశ్ డెడ్ బాడీని వరంగల్ తీసుకెళ్లారు. అక్కడ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు.. సత్యవతి నివాళి అర్పించారు. ఎంజీఎం నుండి ఖానాపూర్ మండలం డబ్బీర్ పేట వరకు జరిగిన శవ యాత్రలో పాల్గొన్న మంత్రి దయాకర్ రావు..టీఆర్ఎస్ నేతలు పాడే మోసారు. ఇక, రాకేశ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేవంత్ సైతం హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ రాకేశ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. రాకేశ్ కుటుంబానికి రూ 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటుగా.. వారి కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కేంద్ర అనుచిత వైఖరి కారణంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రైళ్ల రాకపోకలు క్రమేణా మెరుగుపడుతున్నాయి.












Click it and Unblock the Notifications