దటీజ్ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సర్కార్ పనితీరుకు ఇదే నిదర్శనం!
తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాదిగా పాలన పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలవారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. ఏ ఒక్క వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా వారికి సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వారి పురోగతికి దోహదం చేస్తుంది. ఇక తాజాగా సమాజంలో వివక్షకు గురవుతున్న దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోవారికి ఉపాధి
ఈ నిర్ణయంలో భాగంగా పని మొదలు పెట్టిన రేవంత్ సర్కార్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ సహకారంతో పెట్రోల్ బంక్ ని ఏర్పాటు చేసి అందులో ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులకు ఉపాధి కల్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసి తద్వారా వారికి ఉపాధి అవకాశాన్ని కల్పించారు.

పెట్రోల్ బంక్ పెట్టి ఉపాధి కల్పించిన రేవంత్ సర్కార్
రెండున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ మెడికల్ కళాశాల సమీపంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ట్రాన్స్ జెండర్ తో పాటు 24 మందికి ఉపాధి కల్పించారు. ఈ బంక్ ను నిర్వహించడం కోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు. వీరంతా ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.
సంతోషంలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు
ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ వంటి వారి గురించి ఆలోచించి ఉద్యోగాలు కల్పించడం తమకు ఉపాధిని ఇచ్చిందని దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ లు చెబుతున్నారు. బంక్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగం ఇవ్వడంతో తన జీవితాన్ని సంతోషంగా సాగించగలుగుతున్నానని వేముల శ్రీనివాస్ అనే దివ్యాంగుడు పేర్కొన్నారు.
దివ్యాంగులు రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఫుల్ ఖుష్
అంతేకాదు తమకు జీవనోపాధి కలిగించి తమ కాళ్ళపై తమ నిలబడేలా చేసిందని ప్రభుత్వానికి దివ్యాంగురాలు ఆకుల సంధ్య అనే మహిళ కృతజ్ఞతలు తెలిపారు. తమ వంటి వారి కోసం ఉపాధి కల్పించాలని ఆలోచన చేయడం సంతోషం కలిగించిందన్నారు. వారికి ప్రతి నెల ఈ పెట్రోల్ బంక్ లో ఉద్యోగం చేయడం వల్ల దాదాపు 18 వేల రూపాయల జీతం వస్తుందని దీనివల్ల తాము సంతోషంగా జీవించగలుగుతున్నామని తెలిపారు.
రేవంత్ సర్కార్ పనితీరుకు ఇదే సాక్ష్యం
ఇక ఇదే తరహాలో వివిధ జిల్లాలలో కూడా ట్రాన్స్ జెండర్లకు, దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తోంది. రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వివక్షతో చూడకుండా అన్ని వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించి వారి పురోగతికి దోహదం చేస్తున్నారని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ.












Click it and Unblock the Notifications