ఆలయంలో చోరీకి వచ్చిన దొంగ.. అక్కడే శవమై... అసలేం జరిగింది!!
పక్క ప్లాన్ చేసి గుడిలో చోరీ చేయడానికి ప్రయత్నించిన ఓ దొంగ అనూహ్యంగా అదే గుడిలో రక్తపు మడుగులో శవమై పడి ఉన్న ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పక్కా ప్లాన్ చేసి గుడిలో చోరీ చేయడానికి రంగంలోకి దిగాడు ఓ దొంగ. అయితే అనూహ్యంగా అదే గుడిలో రక్తపు మడుగులో శవమై పడి ఉన్న ఘటన హైదరాబాద్లో జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

గుడిలో చోరీకి వచ్చిన దొంగ.. అడ్డుకున్న వాచ్ మెన్
కుషాయిగూడ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక దొంగ చొరబడ్డాడు. దొంగతనం చేయాలని ముందే ప్లాన్ చేసుకున్న సదరు దొంగ ఆలయం పై పక్కా గా రెక్కీ నిర్వహించి రాత్రి ఎవరూ లేరని భావించి చోరీకి ప్రయత్నించాడు. గుఉటు చప్పుడు కాకుండా స్వామి వారి హుండీ ఖాళీ చేసేద్దాం అని భావించాడు. గుడిలోకి దొంగతనానికి వెళ్లిన దొంగ హుండీని పగలగొట్టడం కోసం ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడే ఉన్న వాచ్ మెన్ హుండీని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్న దొంగను గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.

ప్రాణాలు కోల్పోయిన దొంగ.. కేసు నమోదు
దీంతో సదరు దొంగ వాచ్ మెన్ పై రాయితో దాడి చేశాడు. తనపై దాడి చేస్తున్న దొంగను ప్రతిఘటించడం కోసం వాచ్ తన చేతిలో ఉన్న కర్రతో దొంగను బలంగా కొట్టాడు. దీంతో అక్కడే కుప్పకూలిపోయిన దొంగ తలకు తీవ్ర గాయం కాగా సంఘటన స్థలంలోనే, గుడిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుండీని దొంగలించడానికి దొంగ ప్రయత్నం చేసిన క్రమంలో అడ్డుకుపోయిన రంగయ్య అనే వాచ్ మెన్ పై దొంగ దాడి చేశాడని, ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

ఊహించని విధంగా ముగిసిన దొంగ కథ
ఇక దొంగ వద్ద దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా అతడు కామారెడ్డి సమీపంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన 23 సంవత్సరాల గ్రంథం రాజుగా పోలీసులు గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఇలా గుడిలో చోరీ చేయడానికి వచ్చిన దొంగ కథ ఊహించని విధంగా అర్ధాంతరంగా ఆ గుడిలోనే ముగిసింది. దొంగను అడ్డుకునే ప్రయత్నం చేసిన వాచ్ మెన్ అనుకోకుండా అతడి ప్రాణాలు పోవటానికి కారణం అయ్యాడు. హంతకుడిగా మారాడు.












Click it and Unblock the Notifications