ఏకంగా తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడో తరగతి పిల్లాడు.. వీడియో వైరల్!!
సహజంగా ఇంట్లో ఎటువంటి గొడవలు జరిగినా పెద్దవాళ్ళు సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చెయ్యాలంటే భయపడతారు. అయితే ఇటీవల కాలంలో చిన్న పిల్లలు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లి అనేక విషయాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులంటే ఇప్పుడు పిల్లలకి ఎలాంటి భయం లేకుండా పోయింది. ఎలాంటి విషయం అయినా తప్పు అని భావిస్తే ఠక్కున వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్ లకు వెళ్లి ఫిర్యాదు చెయ్యటానికి భయపడని పిల్లలు
గతంలో ఒక రెండో తరగతి చదువుతున్న పిల్లవాడు తన స్నేహితుడు తన పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడని, అతనిపై కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు లోనూ ఇద్దరు స్నేహితుల మధ్య పెన్సిల్ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన ఘటన మరిచిపోకముందే, మహబూబాబాద్ జిల్లాలోనిబయ్యారంలో ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఓ బుడతడు మ్యాథ్స్ టీచర్తనను కొడుతున్నాడని, మాస్టర్ కొడుతున్న దెబ్బలనుతట్టుకోలేక పోతున్నానని ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాస్టర్ పై ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
అమ్మను కొడుతున్నాడని తండ్రిపైనే ఫిర్యాదు చేసిన బాలుడు
ఇక తాజాగా ఏకంగా తండ్రి పైనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి మూడవ తరగతి చదువుతున్న ఓ పిల్లవాడు ఫిర్యాదు చేసిన ఘటన చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన భరత్ అనే ఓ పిల్లవాడు చక్కగా చేతులు కట్టుకుని సార్ మా నాన్న రోజు తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు. మీరు న్యాయం చేయండి అంటూ పోలీసుల వద్ద ఫిర్యాదు చేశాడు.

బాలుడి ఫిర్యాదుతో తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సిలింగ్ .. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావని, న్యాయం చేస్తామన్న నమ్మకం ఉందా అని, ఎస్సై ప్రశ్నించగా అందుకే వచ్చాను సార్ అంటూ బాలుడు చెప్పాడు. దీంతో వెంటనే ఎస్సై సదరు తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు అని చెప్పి, ముందు ముందు ఇటువంటివి చేయకూడదు అని చెప్పి ఇద్దరిని హెచ్చరించి పంపించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్లాడి వీడియో
ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్న పిల్లవాడు ధైర్యంగా ఎస్ఐకి తన తండ్రి తన తల్లిని హింసిస్తున్న తీరుపై చేసిన ఫిర్యాదుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్దవాళ్ళు ఫిర్యాదు చేస్తేనే పెద్దగా పట్టించుకోని పోలీసులు ఉన్నారని అనేకమంది అసహనం వ్యక్తం చేస్తున్న నేటి రోజుల్లో, చిన్నారుల ఫిర్యాదులకు పోలీసులు స్పందిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఫెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే అంటూ కొందరు ఓపిగ్గా పిల్లాడి ఫిర్యాదు విని స్పందించిన పోలీసుల తీరుకు కితాబిస్తున్నారు.












Click it and Unblock the Notifications