కేసీఆర్ యాదాద్రికి కేజ్రీవాల్, పినరయి విజయన్ లను తీసుకువెళ్ళేది ఇందుకే: బండి సంజయ్
ఈనెల 18వ తేదీన ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభను కెసిఆర్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపించారు. ఈ ఆహ్వానం మేరకు వారిరువురూ రేపు ఖమ్మం సభలో పాల్గొననున్నారు. అక్కడ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

రేపు యాదాద్రి ఆలయానికి ఇద్దరు సీఎంలతో కలిసి బండి సంజయ్
అయితే దానికంటే ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళనున్నారు. తెలంగాణా సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మింపజేశారు. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు యాదాద్రి చేరుకుని, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అక్కడినుండి 12 గంటల 30 నిమిషాలకు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఖమ్మం బయలుదేరి వెళ్తారు.
ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టిన బండి సంజయ్
ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ యాదాద్రికి తీసుకు వెళుతున్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి అంటూ సంచలన పోస్ట్ పెట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేశారు.

హిందూ దేవాలయాన్ని పెట్టుబడి అవకాశంగా చూపే యత్నం
యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అనేది పెట్టుబడి అని, పవిత్ర హుండీకి ప్రజలు ఇచ్చే విరాళాలు రాబడి అని ట్విట్టర్ టిల్లు చెప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో నిర్వహిస్తున్న సమావేశానికి ముందు హిందూ దేవాలయాన్ని పెట్టుబడి అవకాశం గా చూపించేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలను కెసిఆర్ తీసుకు వెళుతున్నట్టున్నారు అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు బండి సంజయ్. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికి ఆలయాల పట్ల, భగవంతుని పట్ల భక్తి లేదని, ఆలయాలను కూడా వ్యాపార కేంద్రాలుగా చూపే లక్షణం వారికి ఉందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications