తిరుమల లడ్డు కల్తీ ఎఫెక్ట్.. వరంగల్ భద్రకాళీ ఆలయంలో ఏం జరిగిందంటే!
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దుమారంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని, ఆ నెయ్యిలో జంతువుల నూనె వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలతో పాటు ల్యాబ్ రిపోర్ట్ లు కూడా సంచలన విషయాలు వెల్లడించడంతో కొనసాగుతున్న దుమారం దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలలోనూ ప్రసాదాల తయారీలో నాణ్యతపైన ఆసక్తికర చర్చకు కారణమైనది.
భద్రకాళీ ఆలయంలో ప్రసాదాలపై అధికారుల తనిఖీలు
ఇక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయం పైన కూడా ప్రభావాన్ని చూపించింది. వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయంలోనూ ప్రసాదాల నాణ్యత విషయంలో తాజాగా అధికారులు తనిఖీ నిర్వహించారు. వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో వరంగల్ జిల్లా ఆహార పరిరక్షణ అధికారి చేపూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు.

భద్రకాళీ ఆలయంలో ముడిసరుకుల శ్యాంపిల్స్ టెస్ట్ కోసం
అమ్మవారి ఆలయంలో ప్రసాదం లడ్డూ, పులిహోర, అవసరమైన ముడి సరుకులు విజయ కంపెనీ నెయ్యి, నూనె, పప్పు, పల్లీలు తదితర ముడి పదార్థాలను తనిఖీ చేసి వాటి శాంపిల్స్ ను రాష్ట్ర ఆహార ప్రయోగశాల హైదరాబాద్ కు పంపించారు.భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా నాణ్యమైన సరుకులతోనే ప్రసాదాలు తయారు చేస్తున్నట్టు భద్రకాళీ దేవాలయ కార్య నిర్వహణ అధికారి శేషు భారతి వెల్లడించారు.
నాణ్యమైన సరుకులతోనే ప్రసాదాలు
దేవాలయంలో ప్రతిరోజు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన సరుకులతోనే ప్రసాదాలు తయారు చేస్తున్నామని చెప్పారు. వివిధ రకాలైన తనిఖీలు, ఆడిట్లు నిర్వహించిన తర్వాత శిక్షణ పొందిన సిబ్బందికి, నాణ్యత ప్రమాణాలతో కూడిన ముడి సరుకులను ఉపయోగించి ప్రసాదాలు తయారు చేయడానికి ఇస్తున్నామని, ప్రసాదాల తయారీలో సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత కూడా చూస్తున్నామని పేర్కొన్నారు.
భద్రకాళీ ఆలయానికి ఈట్ రైట్ ప్లేస్ అఫ్ వర్షిప్ సర్టిఫికెట్
నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత ప్రమాణాలు పాటించిన వారికి భారత ప్రభుత్వ ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థచే ఈట్ రైట్ ప్లేస్ అఫ్ వర్షిప్ సర్టిఫికెట్ (BHOG) ఫిబ్రవరి 2024 లో భద్రకాళి దేవస్థానానికి జారీ చేశారని తెలిపారు. భద్రకాళి దేవాలయంలో ప్రసాదాల నాణ్యత విషయంలో ఎప్పుడు ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా ప్రసాదాలు తయారు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి శేషు భారతి పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ వివాదం తో అలెర్ట్
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదం అపవిత్రమైన వార్తల నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని ఆలయాలపైన, ఆలయాలలో తయారవుతున్న ప్రసాదం పైన ప్రత్యేకమైన దృష్టిని సారించి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ భద్రకాళీ ఆలయ ప్రసాదంపైన కూడా తనిఖీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications