మేడారం జాతరకు దగ్గరలో ఉన్న టూరిస్టు, దర్శనీయ ప్రదేశాలు ఇవే..
మేడారం జాతర (సమ్మక్క- సారలమ్మ జాతర) ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ. ఇది తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం గ్రామంలో రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరగనుంది. మేడారం జాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తారు. ఇక ఈ గిరిజన జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మరి ఈ పర్యటకుల కోసం మేడారం జాతరకు దగ్గరలో అనేక పర్యాటక, దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. మేడారం నుంచి తక్కువ దూరంలో ఉండే ఈ ప్లేస్ లు ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మేడారం జాతరకు దగ్గరలోనే రామప్ప ఆలయం ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం కావడం విశేషం. కాకతీయుల అద్భుత నిర్మాణానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తోంది. రామప్ప ఆలయం మేడారం నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. కాకతీయ రాజు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రుద్రుడు ఈ అపురూప ఆలయాన్ని కట్టించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇక్కడ రామప్ప చెరువు, ఆలయంలోని నంది విగ్రహం, రాతిపై చెక్కిన శిల్పాలు పర్యటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.
లక్నవరం సరస్సును కాకతీయ రాజులు నిర్మించారు. ఇది ఒక అందమైన, చారిత్రక పర్యాటక ప్రదేశం. చుట్టూ కొండలు చిన్న చిన్న ద్వీపాలు, వేలాడే వంతెన, బోటింగ్, క్యాంపింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లక్నవరం సరస్సు మేడారం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఎంతగానో నచ్చుతుంది. ఇక ములుగు జిల్లాలో చెప్పుకోదగిన పర్యటక ప్రదేశంగా బొగత జలపాతం ఉంది. ఈ జలపాతం వానాకాలంలో అద్భుతంగా ఉంటుంది. మేడారానికి దగ్గరలోనే ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం వద్ద 30 అడుగుల ఎత్తునుంచి నీళ్లు కిందకు దూకుతాయి.

ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం.. ములుగు జిల్లాలో ఉన్న పురాతన అభయారణ్యం. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ అభయారణ్యం ఉంది. ఇక్కడ పులులు, చిరుతలు, జింకలు ఉన్నాయి. టూరిస్టులు జీప్ లో అడవిని సందర్శించే అవకాశం ఉంది. ఇక మేడారానికి తాడ్వాయి ఫారెస్ట్ హట్స్ కూడా దగ్గర్లోనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications