ఉందిలే గడ్డుకాలం ముందు ముందునా.. తిన్నదంతా కక్కిస్తాము నంద నందనా: బీజేపీ కొత్తపాట!!
తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నేతలు కెసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడంతో విమర్శనాస్త్రాలు మొదలుపెట్టిన బీజేపీ నేతలు, బెంగళూరు డ్రగ్స్ , హైదరాబాద్ డ్రగ్స్ కేసులను. ఫోనిక్స్ వ్యవహారాన్ని మరోమారు వెలుగులోకి తీసుకు వచ్చి మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసి కెసిఆర్ ని ఇరకాటంలో పెట్టే పనిలో బిజీగా ఉన్నారు.

కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ
మంత్రి కేటీఆర్ డ్రగ్స్ బానిస అని, జుట్టు, రక్తం శాంపిల్స్ ఇస్తే నిరూపిస్తానని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ, హైదరాబాద్ డ్రగ్స్ కేసులోనూ కెసిఆర్ ఫ్యామిలీ పాత్ర ఉందని ఈ కేసును మళ్లీ రీ ఓపెన్ చేస్తే కేటీఆర్ లెక్క తేలుతుందని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ బీజేపీ నాయకుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని, ఏమీ లేదని తేలితే తనను విమర్శించే వాళ్ళు కరీంనగర్ కమాన్ దగ్గర చెప్పుదెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నారా చెప్పాలని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలతో మరోమారు టార్గెట్.. తెరమీదకు ఫోనిక్స్ వివాదం
రక్తం కావాలంటే రక్తం ఇస్తా.. బొచ్చు కావాలంటే బొచ్చు ఇస్తానని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గోర్లు, కిడ్నీ ఇలా ఏది కావాలన్నా ఇస్తానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో బిజెపి నేతలు కేటీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నాడంటూ ఎదురు దాడి మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోయే ప్రమాదముందని కేటీఆర్ భయపడుతున్నారని, అందుకే ఇలా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని టార్గెట్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులను బయటకు తీస్తే కేటీఆర్ కథ బయటకు వస్తుందని, తిన్నదంతా కక్కిస్తామని కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫోనిక్స్ వివాదంలోకి కూడా కేటీఆర్ ను లాగే ప్రయత్నం చేస్తున్నారు.

రియల్ దందాలో కేటీఆర్.. సంచలన ఆరోపణలతో ఇరికించే యత్నం
హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఫోనిక్స్ సంస్థపై ఇటీవల ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలోనూ కేటీఆర్ ఇరుక్కుంటారని, జైలుకు వెళతారని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా మరోమారు స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను, ఫోనిక్స్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అంటూ అరవింద్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ధర్మపురి అరవింద్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే అంటూ ప్రచారం
ఉందిలే గడ్డుకాలంముందు ముందునా !!..తిన్నదంతా కక్కిస్తాము నంద నందనా..!! అంటూ టార్గెట్ చేశారు. మొత్తానికి సీఎం కెసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ బిజెపి నేతలు కొత్త పాట పాడుతున్నారు. కెసిఆర్ ఫ్యామిలీకి ముందు ముందు అంతా గడ్డుకాలమేనని, అవినీతి అక్రమాలతో తిన్నదంతా తిరిగి కక్కిస్తాం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, జరుగుతున్న పరిణామాలు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications