Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ క్లారిటీ!
TPCC Chief Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని.. మంత్రివర్గంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదంటూ స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నేర చరిత్ర ఉందని.. కాంగ్రెస్ ముఖ్య నేతలు, పారిశ్రామికవేత్త ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది అంటూ వ్యాఖ్యానించారు. మొత్తం 650 మంది ఫోన్లు ట్యాప్ చేసిన చారిత్రక దౌర్బాగ్యానికి బీఆర్ఎస్ పార్టీ పాల్పడిందని ఆరోపించారు. ఫోన్లు ట్యాప్ అయిన వారి పేర్లు వెల్లడించాలని సిట్‌ను కోరుతున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నామని.. దీనిలో భాగమైన ప్రతి ఒక్కరు జైలుకు వెళ్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

తమలాంటి నాయకుల ఫోన్లతో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టుపై మహేష్ కుమార్ గౌడ్ మరోసారి విమర్శలు చేశారు. కాళేశ్వరం పేరుతో కోట్లు నదుల్లో కలిపారని విమర్శించారు. నాసిరకం పనులతో ప్రజాధనానన్ని వృథా చేశారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications