పోటీ స్థానం తేల్చేసిన రేవంత్ : టీడీపీ తో పొత్తుపై కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీ-జనసేన పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను ఎక్కడి పోటీ చేసేదీ క్లారిటీ ఇచ్చారు. ఎంపీగా ఉన్న రేవంత్ వచ్చే ఎన్నికల్లో తన నిర్ణయం ఏంటో స్పష్టం చేసారు. సీఎం అభ్యర్ధిపైన తన అభిప్రాయం ఏంటో తేల్చి చెప్పారు. అదే సమయంలో పొత్తుల అంశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ - బీఆర్ఎస్ సంబంధాలు..తమ ఎన్నికల పోరాటం పైన రేవంత్ తమ విధానం ఏంటో వివరించారు. కమ్యూనిస్టులతో తమ మైత్రి పైనా రేవంత్ ఆసక్తి కర అంశాలు వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమవుతున్నాయి.

కొడంగల్ నుంచి బరిలోకి
ప్రస్తుతం మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడిగా ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసారు. రేవంత్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దాని పైన కాంగ్రెస్ లో కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చకు రేవంత్ ముగింపు ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేనునున్నట్లు రేవంత్ తేల్చి చెప్పారు. పాలకుర్తితో పాటు చాలా చోట్ల నుంచి బరిలో దిగాలని తనపై ఒత్తిడి వస్తున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటమే తన లక్ష్యమని రేవంత్ స్పష్టం చేసారు.

జనసేనతో టీడీపీపీ..ఎలా కలుస్తాం
పొత్తుల అంశం పైనా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు - విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని రేవంత్ స్పష్టం చేసారు. జాతీయ స్థాయిలో వామపక్షాలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఏపీలో జనసేనతో కలవడానికి టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. అలాంటి పార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో ఎన్డీఏతో విభేదించిన టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఈ నిర్ణయం పైన ఆ తరువాత పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రస్తుతం బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. బీజేపీ నేతలు అందుకు సుముఖంగా లేకపోవటంతో.. టీడీపీ నాయకత్వంతో రేవంత్ కు ఉన్న సంబంధాలతో మరోసారి పొత్తుకు అవకాశం పైన చర్చ మొదలైంది. ఇప్పుడు దీని పైన రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

బీఆర్ఎస్ తో మా వైఖరి క్లియర్
వచ్చే ఎన్నికల్లో తమకు బీఆర్‌ఎస్ తోనే పోటీ ఉంటుందని రేవంత్ స్పష్టం చేసారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనన్నారు. పలు రాష్ట్రాల్లో అనేక మంది సీఎంలు, మంత్రుల అవినీతిపై విచారణలు చేయిస్తున్న బీజేపీ.. కేసీఆర్‌పై ఎందుకు అలా వ్యవహరించలేకపోతోందని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో ఇమడలేక పోతున్నారని రేవంత్ అన్నారు. బీజేపీ సిద్ధాంతాలు వారికి ఏమాత్రం సరిపోవని తెలిపారు. కేసీఆర్‌పై కోపంతో బీజేపీలోకి వెళ్లి ఇరుక్కుపోయారని అన్నారు. దక్షిణ భారతదేశంపై బీజేపీకి చిన్నచూపు ఉందని.. ఒక్క కిషన్‌రెడ్డి తప్ప మిగతా వారికి పదవులు ఇవ్వడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ తో ఎన్నికల ముందు గానీ, తర్వాతగానీ పొత్తు ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications