హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ రూట్‌లో అస్సలు వెళ్లొద్దు..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. పోలింగ్‌కు మూడు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకొక్క రోజే గడువు. 28వ తేదీ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. ఈ చివరి రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.
ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇదివరకే విడుదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద గల వీర్ సావర్కర్ విగ్రహం వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. మోదీ కాన్వాయ్ సాగిపోయే ప్రధాన మార్గానికి ప్రత్యామ్నాయంగా ఇతర రూట్లల్లో వెళ్లాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు వెళ్లే వాహనాలను రామ్‌నగర్ సాగర్‌లాల్ ఆసుపత్రి మీదుగా, హిందీ మహావిద్యాలయా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను ఆజామాబాద్ క్రాస్ రోడ్స్ మీదుగా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను కట్టమైసమ్మ లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వెళ్లే వాహనాలను వీఎస్టీ, బాగ్ లింగంపల్లి, క్రౌన్ కేఫ్ మీదుగా, హిమాయత్ నగర్ నుంచి నారాయణ గూడ క్రాస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, సెమెటరీ, రామ్‌కోఠి మీదుగా మళ్లించారు.
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా నారాయణ గూడ క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనాలను అశోక్ నగర్ లేన్ మీదుగా మళ్లించారు. నారాయణ గూడ సెమెటరీ మీదుగా వచ్చే వాహనాలను రామ్ కోఠి క్రాస్ రోడ్స్, భవన్స్ కాలేజీ లేన్ మీదుగా మళ్లించారు.












Click it and Unblock the Notifications