కర్రలు, కారంపొడితో.. అటవీ అధికారులపై తిరగబడిన ఆదివాసీలు, కోయపోచగూడాలో చల్లారని ఉద్రిక్తత
ఆదివాసీల పోడు భూముల వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. పోడు చేసుకుంటున్న ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు దాడులు చేయడం, తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లాలో రిజర్వ్ ఫారెస్ట్ లో ఆక్రమణలు చేపడుతున్నారని ఆదివాసీలపై కేసులు నమోదు చేయడంతో అప్పటినుంచి ఇరుపక్షాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

మంచిర్యాల కోయపోచగూడాలో అటవీ అధికారులకు, ఆదివాసీలకు మధ్య చల్లారని ఘర్షణ
పోడు భూముల్లో ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించడంతో గురువారం రోజు ఘర్షణ జరగగా, అటవీ అధికారులు ఆదివాసీ గిరిజన మహిళలపై దాడికి పాల్పడ్డారు. ఇక శుక్రవారంనాడు కూడా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయ పోచ గూడా శివారు అటవీ భూములలో గిరిజనులు మళ్లీ గుడిసెలు వేసుకున్నారు. దీంతో అటవీ భూములలో వేసుకున్న తాత్కాలిక గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైనది.

జోరున వర్షంలోనూ ఆదివాసీల గుడిసెల తొలగింపు... కర్రలు, కారంపొడితో తిరగబడ్డ ఆదివాసీలు
అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెల తొలగింపు అటవీ, పోలీస్ అధికారులకు, గిరిజనులకు మధ్య రెండో రోజు ఘర్షణకు కారణమైంది. జోరున వర్షం కురుస్తున్నా గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగించటానికి శుక్రవారం నాడు కూడా లక్సెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ దాదాపు వంద మంది సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఇక దీంతో గిరిజనులు కర్రలు, కారం పొడి తో అధికారులపై తిరగబడ్డారు. తాము అడవిని నమ్ముకుని జీవిస్తున్నామని తమ గుడిసెలు తొలగించవద్దంటూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఆరుగురు మహిళల అరెస్ట్ .. ఆందోళన చేసిన ఆదివాసీలు
దీంతో అటవీశాఖ, పోలీసు అధికారులు పై దాడికి ప్రయత్నించిన ఆరుగురు మహిళలను జీప్ లో తరలించే ప్రయత్నం చేశారు. దారి పొడవునా గిరిజనులు వారిని అడ్డుకుని తమ వారిని విడిచి పెట్టాలంటూ ఆందోళన చేశారు. అధికారులు వాళ్ళను పక్కకు నెట్టి మరీ మహిళలను తాళ్ళపేట రేంజ్ ఆఫీస్ కి తరలించారు. అక్కడ కూడా గిరిజనులు బైఠాయించి సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఆరుగురు మహిళలు బైండోవర్.. గొడవలు చేస్తే 50వేల జరిమానా విధిస్తామని హెచ్చరిక
పోడు చేసుకుంటున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అధికారులు ఆదివాసీల ఆందోళనను పట్టించుకోకుండా ఆదివాసీలకు హెచ్చరికలు జారీ చేశారు. తహసిల్దార్ హనుమంతరావు పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు మహిళలను బైండోవర్ చేస్తూ ఆరు నెలల పాటు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని, అలా కాదని గొడవలు చేస్తే 50 వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించి విడిచిపెట్టారు.

తనను ఒంటరిగా గదిలో ఉంచి చిత్రహింసలు పెట్టారన్న ఓ ఆదివాసీ మహిళ.. తగ్గని ఉద్రిక్తత
అయితే అటవీ అధికారులు, పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో దోసండ్ల సునీత అనే మహిళ తనను ఒంటరిగా గదిలో నిర్బంధించి అధికారులు చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదివాసీలకు, అటవీ పోలీసు అధికారులకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో పోడు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ములుగు ఎమ్మెల్యే సీతక్క వంటి రాజకీయ నాయకులు ఆదివాసీ గిరిజనులపై జరుగుతున్న దాడులపై భగ్గుమంటున్నారు. తక్షణం పోడు భూముల వ్యవహారం సీఎం కేసీఆర్ తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అటవీ అధికారులు, పోలీసులపై తిరుగుబాటు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.