నయీంతో లింక్స్: గులాబీ నేతలపై వేలాడుతున్న కత్తి
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీంతో సంబంధాలు పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలపై కత్తి వేలాడుతున్నట్లు తెలుస్తోంది. నయీంతో సంబంధాలు పెట్టుకున్నవారిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముందుగా తన పార్టీలోనివారిని ఏరేసి, మిగతా పార్టీలకు చెందినవారిపై చర్యలకు ఉపక్రమించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు చెబుతున్నారు.
నయీంతో సంబంధాలున్న వివిధ పార్టీల నేతలపై కేసులు నమోదు చేయడానికి ముందు తెరాసను చక్కదిద్దాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. నయీంతో సంబంధాలు పెట్టుకుని ఆర్థిక ప్రయోజనం పొందినవారెవరైన తెరాసలో ఉంటే ముందుగా వారిపై కేసులు పెట్టి, ఆ తర్వాత ఇతర పార్టీల నాయకులపై చర్యలు చేపట్టాలనే ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు.
తమ పార్టీలో ఎవరెవరికి, ఏ స్థాయిలో నయీంతో సంబంధాలున్నాయనే విషయంపై కెసిఆర్ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. కెసిఆర్ పచ్చజెండా ఊపితే పోలీసులు చర్యలకు దిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏ వైపు నుంచి కూడా విమర్శలు రాకుండా చూసుకుంటూ ముందుకు సాగాలని కెసిఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీతో రాజీనామా చేయించే విషయంపై కెసిఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలోనివారితో రాజీనామాలు చేయించడం వల్ల, వారిపై చర్యలు తీసుకోవడం వల్ల పార్టీకి మంచి పేరే వస్తుంది గానీ చెడ్డపేరు రాదని కెసిఆర్ భావిస్తున్నారని అంటున్నారు.
నయీం మరణించిన నెల రోజుల తర్వాత కూడా ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయి. నయీం అనుచరులు సిట్ అధికారుల దర్యాప్తులో రాజకీయ నేతల పేర్లు కూడా బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలపై రెండో విడత సిట్ అధికారులు చర్యలకు దిగే అవకాశం ఉందని అంటున్నారు.
మొదటి నుంచి తెరాసలో ఉన్నవారి కన్నా ఇతర పార్టీల నుంచి వచ్చినవారే ఎక్కువ మంది నయీంతో సంబంధాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. నయీంతో సంబంధాలు పెట్టుకుని బినామీలుగా ఉన్నవారు కొంత మంది పదవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కెసిఆర్ ఏం చేస్తారనే విషయంపై చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications