నిన్న కాంగ్రెస్..నేడు టీఆర్ఎస్: తెలంగాణలో మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం: పార్లమెంట్‌లో సెగ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం- తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండో రోజూ దీని తీవ్రత తగ్గట్లదే. మరింత పెరిగింది. కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శనలను అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అందిపుచ్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా పలు చోట్ల మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ సభ్యులు తమ నిరసన గళాన్ని వినిపించారు.

విభజించు..పాలించు..
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు విమర్శలు సంధించారు. కాంగ్రెస్‌ది విభజించు.. పాలించు అనే విధానమని, ఇది వారి డీఎన్‌ఏలోనే ఉందని మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోందని మండిపడ్డారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలపైనా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందని, ఇది వామపక్ష వైఖరికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై..
ఈ సందర్భంగా మోడీ తెలంగాణ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణ విభజన అశాస్త్రీయంగా జరిగిందని మోడీ పేర్కొన్నారు. పార్లమెంట్ తలుపులను మూసి మరీ- ఏపీ పునర్విభజన బిల్లును ఆమోదించుకున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ఏర్పాడలేదని, కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని ధ్వజమెత్తారు. అందుకే- ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని, దూరం పెట్టారని గుర్తు చేశారు.

తొలుత కాంగ్రెస్..
ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. ఘాటుగా విమర్శించారు. తెలంగాణ పట్ల మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిననే విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. తాను ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశాన్ని పరిపాలిస్తోన్న ప్రధానమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని రేవంత్ రెడ్డి అన్నారు.
దిష్టిబొమ్మల దగ్ధంతో..
దీని తరువాత తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ వ్యాఫ్తంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదురుగా మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ, బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినదించారు.

ఇప్పుడు టీఆర్ఎస్..
ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. హోమ్ మంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో హైదరాబాద్ అజoపురా చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మహమూద్ అలీ నివాసం నుంచి ర్యాలీ గా బయలుదేరిన అనంతరం చాదర్ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పార్లమెంట్ ఆవరణలో..
అటు పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ప్రధాని మోడీకి నిరసనగా నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ నినదించారు. మోడీ, బీజేపీ డౌన్ డౌన్ అంటూ హోరెత్తించారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదాలు చేశారు. కోట్లాదిమంది ప్రజల మనోభావాలకు అనుగుణంగా అప్పటి యూపీఏ ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. శాస్త్రీయబద్ధంగా విభజన జరగలేదంటూ ఏడు సంవత్సరాల తరువాత మోడీ చెప్పడంలో అర్థం లేదని విమర్శించారు.












Click it and Unblock the Notifications