సిటీ జనులకు స్మాల్ షాక్: టీ24 టికెట్ ధరలను పెంచిన టీఎస్ఆర్టీసీ
హైదరాబాద్: ప్రయాణికులకు చేరువయ్యేందుకు తీసుకొచ్చిన టీ24 టికెట్ ధరలను టీఎస్ఆర్టీసీ పెంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో తక్కువ ధరలో 24 గంటలపాటు ప్రయాణించడానికి టీ-24 టికెట్ ఎంతో ఉపయోగంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ టీ-24 టికెట్ ప్రస్తుత ధరల్ని పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
సిటీ బస్సుల్లో ప్రయాణించే సామాన్యలకు ఆర్టీసీ నిర్ణయం కొంత షాకింగ్ అనే చెప్పాలి. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ. 90 నుంచి రూ. 100కి పెంచేసింది. ఇక సీనియర్ సిటిజన్ల(పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా రూ. 90కి పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ టీ24 టికెట్ ధరలు జూన్ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సాధారణ ప్రయాణికులకు టీ24 టికెట్ ధర రూ. 100 ఉండగా.. ఏప్రిల్ 24న రూ. 90కి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు రూ. 80కి అంందించింది. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, దాదాపు నెల రోజుులకే మళ్లీ ఆ ధరలను పెంచింది.
వెహికిల్ ట్రాకింగ్ యాప్ : ప్రయాణికుల కోసం ఆర్టీసీ కొత్తగా వెహికిల్ ట్రాకింగ్ యాప్ తీసుకొస్తోంది. ఎవరైనా ప్రయాణికుడు ఏదైనా షాపులో ఉన్నా.. తాను వెళ్లాల్సిన బస్సు కోసం, ఆ మార్గంలో ప్రయాణించే బస్సుల జాడ గురించి ఈ టీఎస్ఆర్టీసీ వెహికిల్ ట్రాకింగ్ యాప్ సహాయంతో తెలుగుసుకోవచ్చు. బస్సు నెంబర్లతో సహా మొత్తం వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. మనం ఎక్కాల్సిన బస్సు ఎక్కడుంది? ఎంతసేపట్లో మనం ఉన్న స్టేజీ వద్దకు వస్దుందన్న వివరాలు ఇందులో ఉంటాయి.
గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బస్సుల సమాచారాన్ని పొందడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సిటీ బస్సుల్లో డ్రైవర్ సీటు వెనుక కానీ.. కండక్టర్ వద్ద పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications