స్ట్రెయిన్ టెన్షన్.. ఇద్దరు హైదరాబాదీలు..? 11న ఒకరు, 13న మరొకరు రాక...
కొత్త రకం కరోనా వైరస్ టెన్షన్ పుట్టిస్తోంది. బ్రిటన్‌లో వైరస్ జాడ కనిపించడంతో యావత్ ప్రపంచం అలర్టయ్యింది. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన కొందరికీ కరోనా సోకడంతో ఆందోళన నెలకొంది. వారిలో ఇద్దరు హైదరాబాదీలు అని తెలుస్తోంది. కొత్త రకం వైరస్ భారత్‌లో ప్రవేశించలేదని.. దీంతో ప్రమాదమేమీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్టీ పీసీఆర్ పరీక్ష..
బ్రిటన్ నుంచి వస్తున్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వైరస్ నిర్ధారణ అవుతోంది. మంగళవారం వివిధ చోట్ల 16 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ నెల 11, 13 తేదీల్లో యూకే నుంచి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చింది. వీరితో కలుపుకొంటే మంగళవారం వరకు మొత్తం 18 మందికి వైరస్ సోకినట్లయింది. తెలంగాణకు వచ్చిన ఇద్దరూ హైదరాబాద్‌కు చెందినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టులో వీరికి పాజిటివ్ రావడంతో గచ్చిబౌలిలోని టిమ్స్‌లో ఉంచినట్లు సమాచారం. కాగా, వీరికి సోకింది కొత్త స్ట్రెయినా? లేక పాత రకం వైర్‌సనా? అన్నది తేలాల్సి ఉంది.

అలర్ట్.. అలర్ట్..
కొత్త స్ట్రెయిన్ విషయంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేస్తోంది. కొత్త స్ట్రెయిన్ ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి వెంటనే కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వస్తే వారి నమూనాలను జాగ్రత్తగా భద్రపరచాలని కోరింది. వాటిని జీనోమ్ సీక్వెన్సీ ల్యాబ్‌లకు పంపాలని ఆదేశించింది. ఆ నమూనాల్లో వైరస్ తీవ్రత ఎలా ఉందో పరీక్షించేందుకు పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని ఆదేశాలు జారీచేసింది.

టిమ్స్‌లో చికిత్స..
కొత్త స్ట్రెయిన్ పాజిటివ్ రోగులకు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో వైద్యం అందించాలని, వారితో కాంటాక్టు అయిన కుటుంబ సభ్యులను అమీర్‌పేట్‌లోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ఐసొలేషన్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్ సహా ఇతర దేశాల నుంచి మూడు వేల మంది తెలంగాణకు వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖకు కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. వారిలో ముందు వచ్చిన 1,500 మందిని మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మరో 1,500 మందికి బుధవారం నుంచి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు.

నేచర్ క్యూర్ కూడా
గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పాజిటివ్ వస్తే గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ఉంచుతారు. టిమ్స్‌లో కొత్త స్ట్రెయిన్ పాజిటివ్ కోసం ప్రత్యేకంగా గదులను సిద్ధం చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. నేచర్ క్యూర్ ఆస్పత్రిలో 300 పడకలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో కొత్త స్ట్రెయిన్ పాజిటివ్‌లు తేలితే అక్కడ సర్కారు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతారు. ఎయిరిండియా విమానంలో లండన్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ చేరుకున్న ప్రయాణికుల్లో 8 మందికి మంగళవారం పాజిటివ్ వచ్చింది. ఇందులో ఏడుగురు ప్రయాణికులు. మరొకరు విమాన సిబ్బంది.

మార్గదర్శకాలు ఇవే..
కొత్త రకం కరోనా వైరస్ సోకినవారికి ప్రత్యేక వైద్య కేంద్రాల్లో చికిత్స అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కొత్తరకం వైర్‌సకు చికిత్స, ఏర్పాట్లకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నవంబరు 25 నుంచి డిసెంబరు 23 వరకూ యూకే నుంచి వచ్చిన వారందరినీ ట్రాక్ చేయాలని, అందులో డిసెంబరు 9 వరకూ వచ్చిన వారిని కలిసి, సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 24 గంటల వ్యవధిలో వరుసగా రెండుసార్లు నెగెటివ్ వస్తేనే, పేషెంట్‌ను ఇంటికి పంపిస్తారు.