రేవంత్ ఆరోపణలు అందుకే.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
తనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మళ్లించేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెప్పినంత మాత్రాన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తగ్గదని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వాస్తవాకు విరుద్ధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని రేవంత్ పై మండిపడ్డారు.

రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఒక విధానం ఉంటుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కేంద్రం చేపట్టిన రూ. 10 లక్షల కోట్ల విలువైన పనులను ఇప్పటికే వివరించామని తెలిపారు. తాను ఇతర కేంద్రమంత్రులను బెదిరించానని దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎంలకు ఎన్నో లేఖలు రాశానని కిషన్ రెడ్డి తెలిపారు. సీఎంలతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తిని తానని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో నిర్మించే 7 టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు తెచ్చినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ను కేంద్రం ఆలస్యం చేయదని చెప్పారు. రేవంత్ ముఖం చూసో.. తాను వద్దంటున్నాననో మెట్రో ఆగదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.
తెలంగాణకు ఆర్ఆర్ఆర్‌ను కేంద్రం మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీజేపీపై ఆరోపణలు చేస్తుంని కేంద్రమంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, రేవంత్‌పై అసంతృప్తి.. ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీజేపీని బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పోదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications