ఆంధ్రా పాలకుల కంటే కేసీఆర్ దోపిడే ఎక్కువ, సిగ్గులేదా.. మీరు ఎంజాయ్ చేసేందుకా?: ఉత్తమ్
హైదరాబాద్: ఆంధ్రా పాలకులు దోచుకున్నదాని కంటే కేసీఆర్ కుటుంబం ఈ నాలుగేళ్లలో దోచుకున్నదే ఎక్కువ అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. ఆయన విద్యార్థి నేతలతో భేటీ సందర్భంగా హైదరాబాదులో మాట్లాడారు.
ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను కేసీఆర్ మోసం చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తండ్రీ కేసీఆర్, కొడుకు కేటీఆర్ నోరు తెరిస్తే అబద్దాలు అన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, ఆ తర్వాత ఫలితాలు వస్తాయని, మరుసటి రోజే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందన్నారు.

ఇప్పటి వరకు భృతి ఎందుకివ్వలేదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 20వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామన్నారు. తమ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టారన్నారు. ఇప్పటి వరకు భృతి ఇవ్వనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు.

కేసీఆర్ సిగ్గులేదా, అసమర్థుడు
ఓ సమయంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సిగ్గులేదా మీకు అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు సీఎంగా పని చేసిన నీవు భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. నాలుగున్నరేళ్లు ఏం చేయని కేసీఆర్ మళ్లీ ఓట్లు వేస్తే ఏదో చేస్తాడట అన్నారు. కేసీఆర్ అసమర్థుడు అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఏమీ అనవద్దన్నట్లుగా ఉందని, ముదనష్టపు కేసీఆర్ పాలనలో అందరూ నష్టపోయారన్నారు.

గ్యాంగ్ ఆఫ్ ఫోర్ ఎంజాయ్ చేసేందుకా
ఈ నలుగురు.. గ్యాంగ్ ఆఫ్ ఫోర్ (కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత) ఎంజాయ్ చేసేందుకు తెలంగాణ వచ్చినట్లుగా ఉందని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణను ఎవరూ ఊహించని విధంగా దోచుకున్నారని, దాచుకున్నారని, ఆ డబ్బుతో, మద్యంతో మళ్లీ గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన దాంట్లో ఒక్కటీ నిజం లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో చేసిందేమీ లేదని, తెలంగాణ వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు.

ఆంధ్రా పాలకుల కంటే ఎక్కువ దోచుకున్నారు
ఆంధ్రా పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువగా దోచుకున్నారని ఉత్తమ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రయివేటు యూనివర్సిటీలు ఉండవని చెప్పారు. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని చెప్పారు. మనం తెలుగుదేశం, ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిగా ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని చెప్పగానే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు
మన దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అన్నారు. ఆ వెంటనే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రావడం ఖాయమని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఐటీఐఆర్ రావడం ఖాయమని చెప్పారు. విద్యార్థులను, మహిళలను, రైతులను అందర్నీ మోసం చేశారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ దీక్షను చూసి కాదని, విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి ఇచ్చారని వీ హనుమంత రావు అన్నారు.












Click it and Unblock the Notifications