Victory Venkatesh: వెంకీమామ లీల.. ఏపీలో బీజేపీకి, తెలంగాణాలో కాంగ్రెస్‌కు ఎన్నికల ప్రచారాల గోల!!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో సినీ గ్లామర్ ను జోరుగా వాడుకుంటున్న అభ్యర్థులు సినీ సెలబ్రిటీలను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేష్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తరఫున ఎన్నికల ప్రచారం చేయడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
కామినేని శ్రీనివాస్ కోసం హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం
ఇంతకీ వెంకటేష్ ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు అంటే వెంకీ మామ స్టైలే వేరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు జనాలు..అసలు ఇంతకీ ఏం జరిగిందంటే తాజాగా ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన హీరో విక్టరీ వెంకటేష్ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి బిజెపి నాయకుడు కామినేని శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.

కామినేనిని గెలిపించాలని కోరిన వెంకటేష్
కలిదిండి మండలం పడమటి పాలెం నుంచి కైకలూరు వరకు ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో విక్టరీ వెంకటేష్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తన సినిమాలోని డైలాగులు చెబుతూ ఆకట్టుకున్నారు. కామినేని శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కైకలూరు నియోజకవర్గం బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
వెంకీ మామగా, పెళ్ళికాని ప్రసాద్ గా అడుగుతున్నా అంటూ ప్రచారం
కామినేని శ్రీనివాస్ ఒక మంచి వ్యక్తని ఆయన ఏదైనా హామీ ఇస్తే నెరవేరుస్తారని చెప్పిన వెంకటేష్ వెంకీ మామగా, పెళ్ళికాని ప్రసాద్ గా అడుగుతున్నా.. కామినేని శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేసిన రామ సహాయం రఘురాం రెడ్డి కి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వెంకటేష్.
ఎనీటైం సింగిల్ హ్యాండ్ అంటూ చెయ్యి గుర్తుకు తెలంగాణాలో ప్రచారం
అక్కడ గణేష్ సినిమాలోని డైలాగులు చెబుతూ ఎనీ టైం సింగల్ హ్యాండ్ అంటూ చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రామ సహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో రెండు పార్టీల కోసం వెంకటేష్ ప్రచారం చేయడంతో జనాలు వింతగా చెప్పుకుంటున్నారు.
జనాలకే కన్ఫ్యూజన్ .. విక్టరీ వెంకటేష్ కు మాత్రం ఫుల్ క్లారిటీ
విక్టరీ వెంకటేష్ తన ఎన్నికల ప్రచారంలో మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. రామ సహాయం రఘురామిరెడ్డి తనకు వియ్యంకుడు కావడంతో, కూతుర్ని ఇచ్చిన బంధుత్వం నేపథ్యంలో ఆయన కోసం ప్రచారం చేశారు. కామినేని శ్రీనివాస్, తన భార్యకు సొంత మేనమామ కావడంతో ఆయనతో ఉన్న బంధుత్వం నేపథ్యంలో ఆయన కోసం ప్రచారం చేశారు. ఇక్కడ వెంకటేష్ వ్యక్తుల కోసమే ప్రచారం చేసినట్టుగా ప్రధానంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications