టీ సర్కార్ పూటకో నాటకం.! బీజేపి నేతలపై నిందలువేయడం సరికాదన్న విజయశాంతి.!
హైదరాబాద్ : బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కారు పూటకో నాటకం ఆడుతూ కేంద్రంపైనా, బీజేపీ నాయకత్వం పైనా నిందలు వెయ్యడమే పనిగా పెట్టుకుంద బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. ముఖ్యంగా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కొనుగోలు అంశంలో కేంద్రంపై టీఆరెస్ నేతలు, మంత్రులు దుష్ప్రచారం చేస్తునే ఉన్నారని మండిపడ్డారు. పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్నందున సూక్ష్మ పోషకాలు (ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ - ఎఫ్ఆర్‌కే) కలిపిన ఉప్పుడు బియ్యాన్ని నెలకు 5 లక్షల టన్నులు ఇచ్చినా కొంటామని ఎఫ్‌సీఐ తెలంగాణ జీఎం స్పష్టం చేసినప్పటికీ తెలంగాణ సర్కారులో ఆశించిన కదలిక లేదని విజయశాంతి గుర్తు చేసారు. అక్టోబర్ నెలాఖరు నాటికి ఉన్న పరిస్థితి గమనిస్తే, మొత్తం 44.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి పంపాల్సి ఉండగా అందులో సగమే పంపించారని లెక్కలు తీసారు విజయశాంతి.

ఎఫ్‌సీఐ ఈ ప్రకటన చేసి మూడు వారాలు కావస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని విజయశాంతి మండిపడ్డారు. ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాకు తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలేంటో గణాంకాలతో సహా చెప్పాలని డిమాండ్ చేసారు. మరోవైపు దేశంలోని బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీలు, రేషన్ షాపుల్లో పూర్తిగా ఫోర్టిఫైడ్ రైస్ వాడకం, సరఫరాకు కేంద్రం కసరత్తు ప్రారంభించిందని, ముఖ్యంగా 2019-20 నుంచి ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడకం దిశగా కేంద్రం దేశ వ్యాప్తంగా 112 జిల్లాలను మూడేళ్ళ కాలానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిందని గుర్తు చేసారు. కాగా దక్షిణాదిలో పలు రాష్ట్రాలు ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు ముందుకొచ్చాయి కానీ తెలంగాణ నుంచి సరైన స్పందన లేదని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సూక్ష్మపోషకాల బియ్యాన్ని ఉపయోగించుకోవాలని, ఎఫ్‌సీఐకి సరఫరా చెయ్యాలని, కేంద్ర విద్యాశాఖ లేఖ రాసినా తెలంగాణ పాలకుల స్పందన లేదని, ఒకవైపు ఇన్ని అవకాశాలున్నప్పటికీ వినియోగించుకోకుండా కేంద్రాన్ని దోషిగా చూపే తెలంగాణ పాలకుల దుర్నీతిని ప్రజలకు వివరిస్తామన్నారు విజయశాంతి.












Click it and Unblock the Notifications