ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్ఏ దారుణహత్య; మంచిర్యాల జిల్లాలో ఘటన; ఉద్యోగుల్లో మళ్ళీ టెన్షన్
తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్ఏ ని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బహిరంగంగా దుండగులు ప్రభుత్వ కార్యాలయంలోనే హత్య చేయడం సంచలనంగా మారింది.

తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్య
వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న కొత్తపల్లి ఏరియాకు చెందిన వీఆర్ఏ 50 సంవత్సరాల దుర్గం బాబును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. సోమవారం నాడు దుండగులు కన్నెపల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి వీఆర్ఏ గా విధులు నిర్వర్తిస్తున్న దుర్గం బాబుపై దాడికి దిగారు. తనపై దాడి జరుగుతుందని దుర్గం బాబు అర్ధం చేసుకునే లోపే వారు కత్తితో దుర్గం బాబు గొంతు కిరాతకంగా కోశారు.

ప్రభుత్వ కార్యాలయంలోనే నేరుగా వెళ్లి హత్య .. ఉద్యోగుల్లో టెన్షన్
రక్తపుమడుగులో పడివున్న వీఆర్ఏ దుర్గం బాబును స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ప్రభుత్వ కార్యాలయంలో హత్య ఘటన చోటు చేసుకోవటంతో కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు వణికిపోతున్నారు.

వ్యక్తిగత కక్షలా లేక వృత్తి పరమైన కక్షనా?
వ్యక్తిగత కక్షలతో హత్య జరిగిందా? లేక రెవెన్యూ కార్యాలయంలో పని చేస్తున్నాడు కాబట్టి, వృత్తిపరమైన ఇబ్బందులలో భాగంగా హత్య జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. హత్య జరిగిన తీరుపై పోలీసులు అక్కడ ఉన్న స్థానికులను అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను పిలిపించి వారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్నది విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సంఘటనా స్థలం వద్ద అన్ని వివరాలను సేకరించారు పోలీసులు. దీనిపై విచారణ జరుపుతున్నామని సిఐ బాబురావు వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

గతంలోనూ తహసీల్దార్ ఆఫీసుల్లో దారుణ ఘటనలు
గతంలో తహసీల్దార్ ఆఫీసులపై దాడులు జరిగాయి. రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ విజయ రెడ్డి సజీవ దహన సంఘటన గతంలో సంచలనం సృష్టించింది. గతేడాది మెదక్ జిల్లా శివ్వం పేటలో తహసీల్దార్ పై రైతులు డీజిల్ పోసిన ఘటన చోటు చేసుకుంది.
సకాలంలో తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోగొట్టుకున్న రైతుకు బీమా డబ్బులు రాలేదని ఆరోపిస్తూ రైతులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి తహసీల్దార్ పై దాడికి ప్రయత్నించారు. ఇక తాజా ఘటనతో మరోమారు ఎమ్మార్వో ఆఫీసులలో వణుకు మొదలైంది.












Click it and Unblock the Notifications