వరంగల్ కెసిఆర్‌కు పరీక్ష: అమిత్ కోర్టులోకి నెట్టిన బాబు, వివేక్ భయం వెనుక..!
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల పైన ఆయా పార్టీలు చర్చోపచర్చలు జరుపుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వరంగల్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి - టిడిపి కూటమి, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు పోటీకి సై అంటున్నాయి.
వరంగల్ ఉప ఎన్నికలు తెలంగాణ సీఎం కెసిఆర్‌కు, టిఆర్ఎస్ ప్రభుత్వానికి పరీక్షే అని చెప్పవచ్చు. రైతుల ఆత్మహత్యలు తదితర కారణాల నేపథ్యంలో.. టిఆర్ఎస్‌కు మెజార్టీ తగ్గినా కెసిఆర్‌కు ఇబ్బందేనని చెప్పవచ్చు. మెజార్టీ తగ్గడాన్ని విపక్షాలు ఆయుధంగా మలుచుకుంటాయి.
టిఆర్ఎస్ ఓడితే మాత్రం మరీ ఘోరంగా పరువు పోవడం ఖాయం. వరంగల్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. వరంగల్ ఎన్నికల్లో బిజెపి - టిడిపి కూటమి తరఫున తమ పార్టీ నుంచే అభ్యర్థిని నిలబెట్టాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఉవ్వీళ్లూరుతున్నారు.
అయితే, వారి ఉత్సాహానికి టిడిపి అధినేత చంద్రబాబు గండి కొడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ సీటును బిజెపికి కేటాయించామని, మిత్ర ధర్మం పాటిస్తూ దానిని బిజెపికే ఇద్దామని చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలకు మంగళవారం బెజవాడలో సూచించారు.
అదే సమయంలో అభ్యర్థి ఎంపిక అంశాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కోర్టులో టిడిపి చీఫ్ చంద్రబాబు వేశారు. బిజెపికే అవకాశమిద్దామని, ఆ పార్టీ అభ్యర్థి గెలుపుకు పూర్తిగా కృషి చేద్దామని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.
అయితే, కెసిఆర్ పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వరంగల్లో మనం పోటీ చేస్తే గెలుపు ఖాయమని, మనమే పోటీ చేద్దామని తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబుకు సూచించారు. దీనికి ఆయన ససేమీరా అన్నారు. దీంతో, వారు చంద్రబాబు మాట వినక తప్పలేదు.
తెలంగాణ టిడిపి నేతలు మాట్లాడుతూ... మిత్రధర్మం పాటిస్తూ సీటును బిజెపికే వదిలేస్తామని, ఈ విషయం అమిత్ షాతో మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారని తెలిపారు. తుది నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ... బిజెపి కూడా పోటికీ సై అంటున్న నేపథ్యంలో... కమలం పార్టీ అభ్యర్థే పోటీ చేసే అవకాశాలున్నాయి.
వివేక్ నో వెనుక?
కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా పెద్దపల్లి మాజీ ఎంపి జి వివేక్ పేరు వినిపిస్తోంది. అయితే, అందుకు వివేక్ ససేమీరా అంటున్నారు. దీంతో, హైకమాండ్ రంగంలోకి దిగిందని తెలుస్తోంది.
వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం సరికాదని వివేక్ భావిస్తున్నారని తెలుస్తోంది. తాను పోటీ చేసి ఓడిపోతే రెంటికి చెడ్డ రేవడిలా మారుతానని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. వరంగల్లో పోటీ చేసి ఓడిపోతే, వచ్చే ఎన్నికల్లో తాను పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు కొంత అననూలత ఉంటుందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.

పోటీకి జగన్ పార్టీ సిద్ధం
వరంగల్ లోకసభ ఉపఎన్నికలో పోటీ చేయాలని తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ వైసీపీ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై వరంగల్ ఉపఎన్నికపై చర్చించారు.
ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం తప్పదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైయస్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్, వైసిపి, టిఆర్ఎస్ మధ్యనే పోటీ అన్నారు.
వామపక్షాల తరఫున గాలి వినోద్ కుమార్
అన్ని పార్టీల కంటే ముందే వరంగల్ అభ్యర్థిని వామపక్షాలు ప్రకటించాయి. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. తన గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు. వరంగల్ ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారన్నారు. వరంగల్ ఎన్నికలో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ వచ్చే నెల 2వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు.
టీఆర్ఎస్ ఇంఛార్జిగా హరీష్ రావు
వరంగల్ లోకసభకు జరగనున్న ఉపఎన్నికకు మంత్రి హరీష్ రావు ఇంఛార్జిగా నియమించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్... ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 29 తరువాతే అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉపఎన్నిక బరిలో ప్రొ సాంబయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications