'కాళేశ్వరం టు భద్రాచలం'కు కేంద్రం ఒకే!: తెలంగాణలో జల రవాణా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జల రవాణా మార్గం ఏర్పాటు కానుంది. తెలంగాణలో జల రవాణా మార్గం ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసింది. ఇప్పటికే కేంద్రం గోదావరి నదిపై ఏపీలోని రాజమండ్రి నుంచి బకింగ్‌హాం కాలువ ద్వారా చెన్నై వరకు జల రవాణా పనులు చేపట్టేందుకు పునుకుంది.
ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా తెలంగాణలోని గోదావరి నదిపై కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు జల మార్గానికి అవకాశముందని, సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని రోడ్లు, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

స్వయంగా గడ్కరీతో మాట్లాడడంతో పాటు ప్రభుత్వం తరఫున లేఖ కూడా పంపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ రోడ్లు, జాతీయ రహదారులు, నౌకాయాన శాఖ తరఫున మంత్రి గడ్కరీ ప్రత్యుత్తరం రాశారు. జాతీయ జల మార్గాల బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టామని, దీంట్లో 101జలమార్గాలు కొత్తగా చేర్చాలని పేర్కొన్నామన్నారు.
ఇది ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉందన్నారు. ఆ కమిటీ సూచనలు, సవరణలతో వచ్చే సమావేశాల్లో బిల్లును మరోసారి సభ ముందు ఉంచుతామని, సవరణ బిల్లులో గోదావరిపై నాసిక్ నుంచి రాజమండ్రి వరకు జలమార్గాన్ని చేరుస్తామన్నారు.
మరోవైపు, తెలంగాణలో చైనా సంస్థ సహకారంతో ఏర్పాటు చేయనున్న భూభాగ ఓడరేవు, ప్రిఫ్యాబ్ కాంక్రీడ్ తయారీ పరిశ్రమలకు అనువైన స్థలాల ఎంపిక పైన ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చైనా కంపెనీ సాని ఈ రెండు భారీ ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.












Click it and Unblock the Notifications